సాధారణంగా వర్షాకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ కావు. వర్షాలు గట్టిగా పడితే థియేటర్ల వరకు వెళ్లడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంట్లోనే కూర్చొని ఓటీటీలు పెట్టుకుని చూడని సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని.. ఇంట్లో పకోడీలు తింటూ చూడాలని భావిస్తారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే.. ఈ సీజన్లో వస్తే, నష్టపోతున్న సందర్భాలు అనేకం. అయితే వర్షాకాలం అని కాదు కానీ.. వరదలు వచ్చిన టైంలో జనాలని థియేటర్లకు రప్పించిన ఘనత ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మాత్రమే దక్కింది.
ఆయన హీరోగా తెరకెక్కిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా 1990 మే 9న విడుదలైంది. వాస్తవానికి అది సమ్మర్ సీజన్ అయినప్పటికీ.. దానికి రెండు, మూడు రోజుల ముందు నుండి భారీగా వర్షాలు కురిసాయి. వరదలు వచ్చేశాయి. ఎక్కడ చూసినా నీళ్ళే..! డిస్ట్రిబ్యూటర్లు అంతా టెన్షన్లో ఉన్న టైం అది. ఆ టైంలో రిలీజ్ వద్దని.. చాలా మంది నిర్మాత అశ్వినీదత్ (C. Aswani Dutt) , దర్శకుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) ..లకి సూచించారు. కానీ వాళ్ళు వెనకడుగు వేయలేదు. ప్రింట్లు పంపడం కూడా పెద్ద ఛాలెంజ్ గా తీసుకున్నారు.
సినిమాని మొండి ధైర్యంతో రిలీజ్ చేశారు. ప్రేక్షకులు వరదల్ని లెక్కచేయకుండా థియేటర్లకు వచ్చారు. థియేటర్లలో మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నా తగ్గలేదు.ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ సినిమాని బ్లాక్ బస్టర్..ని చేశారు. సరిగ్గా.. 34 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది. కాకపోతే ఈసారి నిలబడింది నాని (Nani) సినిమా. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రం గత గురువారం నాడు అంటే ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సినిమాకి మంచి టాక్ వచ్చింది.
కానీ ఎక్కడ చూసినా వర్షాలే. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా చాలా చోట్ల వరదలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చిన్న విషయం కాదు. కానీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) విషయంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి జరిగిన అద్భుతమే జరిగింది అని చెప్పాలి. వీకెండ్ కే సినిమా 70 శాతంపైనే రికవరీ సాధించింది.సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ‘సరిపోదా..’ కి ఉంది.