శ్రీదేవి… తెలుగు సినిమా చరిత్రలోనే కాదు ఏకంగా పాన్ ఇండియా చరిత్రలో ఆమె కంటూ కొన్ని పేజీలు ఉన్నాయని చెప్పాలి. పాన్ ఇండియా హీరోయిన్ అనే పదం ఇప్పుడిప్పుడు అక్కడక్కడ వినిపిస్తుందేమో కానీ… ఆమె ఎప్పుడో చేసి చూపించింది. అతిలోక సుందరి అని మనం పిలుచుకునే శ్రీదేవి… ఎందరికో ఆరాధ్య దేవత. ఇంతలా ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె నటించిన ఓ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు పడ్డ ఆర్థిక కష్టం గురించి తెలిసింది కాబట్టి.
‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమా గుర్తుందా? (Sridevi) శ్రీదేవి ఫిల్మోగ్రఫీలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 15 ఏళ్ల విరామం తర్వాత ఆమె ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. కమర్షియల్ హంగులు లేకుండా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. వసూళ్లకు వసూళ్లు, పేరుకు పేరు, మజాకు మజా అన్నీ వచ్చాయి ఆ సినిమాతో, అయితే సినిమా చేద్దాం అంటే డబ్బులు మాత్రం తొలుత పుట్టలేదట. అంటే నిర్మాతలు ముందుకు రాలేదు.
ఈ ఆసక్తికర విషయాన్ని చిత్ర నిర్మాత ఆర్ బాల్కినే తెలియజేశారు. దర్శకురాలు గౌరీ షిందే ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ కథను సిద్ధం చేసినప్పుడు ‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా, అందులోనూ యూఎస్‌లో షూటింగా?’ అంటూ ఎవరూ ముందుకు రాలేదట. ఇంకొందరు అయితే అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా సినిమా చేయడానికి ముందుకు రాలేదు అని ఆర్ బాల్కి చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కోసం అంత మొత్తంలో ఖర్చు పెట్టాలని ఎవరు అనుకుంటారు? అని కూడా కొందరు అడిగారట.
అయితే ఆ సమయంలో ఆర్ బాల్కి… రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాని కలిశారట. విషయం మొత్తం చెప్పాక…సినిమా నిర్మాణం విషయంలో ఆయన సాయం చేశారట. అలా ‘ఇంగ్లిష్ వింగ్లీష్’ సినిమా పట్టాలెక్కింది అని చెప్పారు. అలా రూ.10 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు వసూళ్లు సాధించింది.