స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఫస్ట్ మూవీ ఏదనే ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కల అని చెబుతున్నారు. బాలయ్య చిన్న వయస్సులోనే ఈ సినిమాలో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా బాలయ్య నటనకు మంచి మార్కులు పడటంతో పాటు నందమూరి ఫ్యాన్స్ ఫేవరెట్ హీరోలలో బాలయ్య కూడా స్థానం సంపాదించుకున్నారు. 1974 సంవత్సరం ఆగష్టు నెల 30వ తేదీన తాతమ్మ కల మూవీ థియేటర్లలో రిలీజైంది.
రామకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భానుమతి, హరికృష్ణ, రాజబాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజయ్యే సమయానికి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ నియంత్రణ దిశగా అడుగులు వేయడంతో పాటు ప్రచారం చేసింది. అయితే తాతమ్మ కల సినిమాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కుటుంబ నియంత్రణ నిర్ణయానికి వ్యతిరేకంగా కొన్ని సీన్లు ఉన్నాయి.
తాతమ్మ కల సినిమాలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీన్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాపై కొంతకాలం పాటు బ్యాన్ విధించడం జరిగింది. ఒక విధంగా బాలయ్య మూవీ కేంద్రానికే చుక్కలు చూపించింది. అయితే సీనియర్ ఎన్టీఆర్ అప్పటి కాంగ్రెస్ నేతలకు సినిమాలోని సన్నివేశాల వెనుక ఉద్దేశం తెలిపి కొన్ని సీన్లలో మార్పులు చేసి 1975 సంవత్సరం జనవరి రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
బాలయ్య (Balakrishna) అభిమానులలో చాలామందికి బాలయ్య తొలి సినిమా వివాదాల్లో చిక్కుకుందనే విషయం తెలియదు. పల్లెటూరి అమాయకత్వానికి పట్టణం పోకడకు మధ్య తేడాను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. తాతమ్మ కల సినిమాలోని పాటలు సైతం ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా దసరా విజేతగా నిలుస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.