‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మావయ్య పాత్ర చాలా ఆకట్టుకుంది. ఆ పాత్రలో గొప్ప లక్షణాలు దాగి ఉంటాయి. కల్మషం లేని మనస్తత్వం, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు, ప్రమాదాలు ఎదురైనా.. మొహం పై చెరగని చిరు నవ్వు.. ఇవన్నీ కూడా ఆ పాత్రలో మిళితమై ఉంటాయి. రేలంగి మావయ్య పాత్ర తెరపై వస్తున్నంత సేపు ప్రేక్షకులకి ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే టాలీవుడ్లో ఇలాంటి మనిషి ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా అదే సినిమాలో పెద్దోడు పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి.
ఆయన అభిమానులు మాత్రమే కాదు మిగిలిన హీరోల అభిమానులు, కామన్ ఆడియన్స్ కూడా ఈ మాటని అంగీకరించకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు. దివంగత స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ గా పిలవబడే దగ్గుబాటి రామానాయుడు గారి చిన్న అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గారు… తక్కువ టైంలో వరుస విజయాలు సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదిగారు. రెగ్యులర్ పంధాలో సినిమాలు చేయడం ఈయనకి నచ్చదు. కెరీర్ ప్రారంభం నుండి వినూత్నమైన ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు.
‘శత్రువు’ లాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామా చేసినా, ‘సుందరకాండ’ వంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేసినా, ‘చంటి’ వంటి మందబుద్ధి అబ్బాయిగా చేసినా వెంకటేష్ కే చెల్లింది. అలా అని మాస్ ఆడియన్స్ ను కూడా ఎప్పుడూ ఆయన డిజప్పాయింట్ చేసింది లేదు. ‘కొండవీటి రాజా’ ‘కూలి నెంబర్ 1’ ‘జయం మనదేరా’ ‘లక్ష్మీ’ ‘తులసి’ వంటి మాస్ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టాడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మహిళా ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకునేలా ఆకట్టుకున్నాడు.
ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించడం కూడా వెంకీ నటనలో కొసమెరుపు అని చాలా మంది చెప్పుకుంటారు. ఇక వ్యక్తి గతంగా వెంకటేష్.. చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్ అని ఇండస్ట్రీలో అంతా చెబుతూ ఉంటారు. పెద్దగా ఆరాటాలు, ఆర్భాటాల జోలికి పోడు. మొబైల్ స్క్రీన్ పగిలినా.. అదే మొబైల్ క్యారీ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞాని అని, ప్రశాంతత కోసం ఏకాంతంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు.
ఇక వెంకటేష్ (Venkatesh) గురించి ఇండస్ట్రీలో ఇంకొంతమంది ‘టాలీవుడ్ రేలంగి’ మావయ్య అని అంటుంటారు. వెంకటేష్ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంటుంది. ఇక ఈరోజు వెంకీ తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక వెంకటేష్ నటించిన ‘సైందవ్’ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ కానుంది.