కథానాయకుడిగా కెరీర్ మొదలెట్టి విలన్ గా మారి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్ని అలరిస్తూ దూసుకుపోతున్న నటుడు ఆది పినిశెట్టి. “ఒక V చిత్రం” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఆది “మృగం”తో నటుడిగా తన సత్తాను చాటుకొన్నాడు. అయితే.. “సరైనోడు” చిత్రంలో విలన్ గా తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పట్నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్న ఆది పినిశెట్టి నిన్న విడుదలై ప్రేక్షకులను-విమర్శకులను ఆకట్టుకొంటున్న “యు టర్న్” చిత్రంతో మరోమారు నటుడిగా తన స్టామినాను నిరూపించుకొన్నాడు. ఆ సినిమాలో పోషించిన ప్రదీప్ నాయక్ పాత్రకు తనకు వస్తున్న అప్రిసియేషన్ ను మీడియాతో పంచుకొన్నారు ఆది.
నా కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ చిత్రమిది..
“రంగస్థలం” తర్వాత సమంతతో ఇమ్మీడియట్ గా స్క్రీన్ షేర్ చేసుకొని హిట్ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆది పినిశెట్టిగా కాకుండా ప్రదీప్ నాయక్ గా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒక నటుడిగా నా పాత్రకి గుర్తింపు రావడం కంటే కావాల్సిందే ఏముంటుంది. అందుకే “యు టర్న్” చిత్రం నా కెరీర్ లో ఒన్నాఫ్ ది బెస్ట్ ఫిలిమ్ గా నిలిచిపోతుంది.
నా కెరీర్ బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్..
ఈ సినిమాలోని పాత్ర నాకు బాగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఈ సినిమాలో నా పాత్రకి ఒక పర్టీక్యులర్ ఇంట్రడక్షన్ సీన్ లేకపోవడమే. ఈ విషయంలో దర్శకుడు పవన్ మొదట్లో కాస్త ఇబ్బందిపడినా నాకు ఎలాంటి ఇంట్రడక్షన్ లేకపోవడమే మంచి ఇంట్రడక్షన్ అనిపించింది. అందుకే ఇది నా కెరీర్ బెస్ట్ ఇంట్రడక్షన్.
లూసియా చూసి పవన్ డైరెక్షన్ లో చేయాలని ఫిక్స్ అయిపోయాను..
“యు టర్న్” రీమేక్ లో నటించాలని అని ఆఫర్ వచ్చినప్పుడు అతని దర్శకత్వంలో వచ్చిన “యు టర్న్” సినిమా చూశాను. ఆ సినిమా చూసిన వెంటనే ఇంకా “యు టర్న్” చూడకముందే.. పవన్ డైరెక్షన్ లో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయాలని ఫిక్స్ అయిపోయాను.
సినిమా చూశాక ఆ తప్పులు చేయడం మానేశా..
“యు టర్న్” సినిమా చూడక ముందు అప్పుడప్పుడూ రెడ్ సిగ్నల్స్ జంప్ చేసేవాడిని. కానీ.. సినిమా చూశాక అలా చేయడం మానేశాను. మనం చేసిన ఒక చిన్న తప్పు మనల్నే ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చాలా సెన్సిబుల్ గా ఎలాంటి నీతులు చెప్పకుండా చూపించాడు పవన్. అందుకే “యు టర్న్” అందరూ చూడాల్సిన సినిమా.
రివ్యూ రైటర్స్ నాకు చాలా నేర్పించారు..
“నీవెవరో” సినిమా టైమ్ లో నేను రివ్యూ రైటర్స్ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆ సినిమాలో తప్పులున్నాయి అని నేను ఒప్పుకొంటాను కానీ.. రివ్యూ రైటర్స్ ఎనలైజ్ చేసే సినిమా కాదది. అది మాత్రమే చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే నా షూటింగ్ గ్యాప్ లో నేను రివ్యూస్ అన్నీ చదువుతుంటాను. నా ప్లస్ & మైనస్ అనేవి ఆ రివ్యూల ద్వారానే తెలుసుకొంటుంటాను.
ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకొంటున్నాను..
ప్రెజంట్ ఒక నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడప్పుడే మళ్ళీ విలన్ గా మాత్రం చేయదలుచుకోలేదు. కొన్నాళ్లపాటు మంచోడిలా ఉందామని ఫిక్స్ అయ్యాను. ఒకవేళ అలా ఉండడం బోర్ కొట్టేసి అదే సమయానికి మంచి కథ వస్తే మళ్ళీ తప్పకుండా విలన్ గా నటిస్తాను.
నావరకూ కమర్షియల్ సినిమా అనేదానికి అర్ధం వేరు..
నా దృష్టిలో ఆరు పాటలు, రెండు ఫైట్లు ఉంటే కమర్షియల్ సినిమా కాదు. నా సినిమా ద్వారా నిర్మాతలకు డబ్బులు వచ్చాయి అంటే అది కమర్షియల్ సినిమా కిందే లెక్క. నా దృష్టిలో “యు టర్న్” పక్కా కమర్షియల్ సినిమా. అయితే.. నాకు కూడా కమర్షియల్ హీరో అనిపించుకోవాలని ఉంది. ఇప్పుడు మారిన ప్రేక్షకుల దృష్టి కోణానికి తగ్గట్లుగా ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలని మాత్రం ఉంది.
ఆర్.ఎక్స్ 100 తమిళ రీమేక్ తో ఆ గుర్తింపు వస్తుంది అనుకొంటున్నాను..
ప్రస్తుతం తమిళంలో ఆర్ ఎక్స్ 100 రీమేక్ చేస్తున్నాను. తెలుగులో దొర్లిన తప్పులను తమిళంలో సరిచేస్తున్నాము. సినిమాలో హీరో క్యారెక్టర్ లోని ఇన్నోసెన్స్ & హీరోయీన్ క్యారెక్టర్ లోని కన్నింగ్ నాకు బాగా నచ్చాయి. ఈమధ్య న్యూస్ పేపర్ లో వచ్చే కొన్ని వార్తలు చదువుతుంటే.. ఏంటి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అనిపించింది. అందుకే ఆర్ ఎక్స్ 100 సినిమాకి జనాలు బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. అలాగే.. ఈ సినిమాతో నాకు కమర్షియల్ హీరో ఇమేజ్ కూడా వస్తుందని భావిస్తున్నాను.