ఆ మధ్య సినిమా పెద్దలు అందరూ కలసి సినిమాలకు బంద్ పెట్టి మరీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని సినిమా రిలీజ్ అయిన 8 వారాల వరకు ఓటీటీకి ఇవ్వకూడదు. అలాగే ఏ ఓటీటీలో సినిమా వస్తుంది అనేది ముందే చెప్పకూడదు అంటూ భారీ నిర్ణయాలే తీసుకున్నారు. అయితే అవి పాటిస్తున్నారా? అంటే అస్సలు లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కషన్ అంటే.. ఓటీటీ డీల్స్ గురించి ఓ స్టార్ హీరో కీలక నిర్ణయం తీసుకోవడమే.
బాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటే ఆమిర్ ఖాన్ (Aamir Khan) అని చెప్పాలి. ఆయన సినిమాల విషయంలో, సినిమా కోసం పడ్డ కష్టం విషయంలో ఆయన్ను కొట్టేవారే లేరు. అయితే రీసెంట్‌గా ఆయన సినిమాలు సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. ‘లగాన్’, ‘రంగ్ దె బసంతి’ (Rang De Basanti) , ‘3 ఇడియట్స్’ (3 Idiots) , ‘పీకే’, ‘దంగల్’ అంటూ వరుస భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు మోస్తరు విజయానికే ముఖం వాచిపోయి ఉన్నారు.
దానికి కారణం ఆయన ఎంతగానో మనసుపడి చేసిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) దారుణమైన అనుభవాన్ని మిగిల్చడమే. ఆ డిజాస్టర్ నుండి బయట పడటానికి ఆమిర్ చాలా నెలలు తీసుకున్నాడు. ఆ తర్వాత ‘సితారే జమీన్ పర్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఓటీటీ డీల్స్ విషయంలోనే ఆమీర్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాతి సినిమాలకూ ఆ నిర్ణయం అమలులో పెడతాడట.
తన సినిమాలకు విడుదలకు ముందే డిజిటల్ డీల్స్ చేసుకోకూడదన్నది ఆమిర్ ఆలోచనట. అంతేకాద రిలీజ్ అయితే వెంటనే కూడా ఒప్పందం కుదుర్చుకోడట. థియేటర్లలో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు ఆడనిచ్చి ఆ తర్వాతే డిజిటల్ హక్కుల అమ్మకం సంగతి చూడాలని ఆమిర్ నిర్ణయంచుకున్నాడట. ఓటీటీల ప్రభావం థియేటర్ల మీద గట్టిగానే ఉన్న తరుణంలో ఆమిర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరి మన హీరోలూ ఈ పని చేస్తారా?