ఎప్పుడో 2012లో షూటింగ్ మొదలై.. 2014 వరకూ జరిగి 2017 నుంచి విడుదలయ్యేందుకు ప్రయత్నిస్తూ.. ఎట్టకేలకు 2021లో బయటపడిన సినిమా “ఆరడుగుల బుల్లెట్”. గోపీచంద్ – నయనతార జంటగా నటించిన ఈ చిత్రం మీద జనాలకు ఏమాత్రం ఆసక్తి లేదు. విడుదలైన రెండుమూడు ట్రైలర్స్ కూడా ఎలాంటి ఆసక్తి రేకెత్తించలేకపోయాయి. గోపీచంద్ కూడా ఈ సినిమాను అస్సలు ప్రమోట్ చేయలేదు. మరి ఈ “ఆరడుగుల బుల్లెట్” ఆడియన్స్ కు నచ్చుతుందో లేదో చూద్దాం..!!
కథ: అసలు బాధ్యత అనేది తెలియకుండా, ఖాళీగా తిరుగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు శివ (గోపీచంద్). ఇంట్లోవాళ్ళందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా ఏమాత్రం సిగ్గులేకుండా బ్రతికేస్తుంటాడు. తండ్రి (ప్రకాష్ రాజ్) కష్టాన్ని అర్ధం చేసుకోకుండా నానా పేచీ పెడుతుంటాడు. ఉన్నట్లుండి నయన (నయనతార)ను ప్రేమిస్తాడు శివ. తనకే టికాణా లేదు, ఇక తనకో గర్ల్ ఫ్రెండ్ మైంటైన్ చేయడం ఎలా అనే ఆలోచన లేకుండా ఆమెకు ప్రపోజ్ చేస్తాడు శివ.
కట్ చేస్తే.. లోకల్ గూండా (అభిమన్యు సింగ్) శివ తండ్రి కష్టార్జితమైన ల్యాండ్ ను కబ్జా చేస్తాడు. ఆ తర్వాత పరిణామాలు ఏమిటి? అనేది “ఆరడుగుల బుల్లెట్” కథాంశం.
నటీనటుల పనితీరు: గోపీచండ్ ఎప్పుడో “మొగుడు” తర్వాత నటించిన సినిమా ఇది. నటుడిగా తన 100% ఇచ్చినప్పటికీ క్యారెక్టర్ కి డెప్త్ కానీ ఒక వేల్యూ కానీ లేకపోవడంతో చాలా లేకిగా ఉంటుంది అతడి పాత్ర. అటు మాస్ ఆడియన్స్ కానీ, ఇటు యూత్ కానీ కనెక్ట్ అవ్వలేరు.
ఇక నయనతార క్యారెక్టర్ తో సంబంధం లేకుండా కాసేపు కనిపించి, కనువిందు చేసి కనుమరుగైంది.ప్రకాష్ రాజ్ కి తండ్రి పాత్రలు కొత్త కావు. కావున ఈ చిత్రంలోనూ తండ్రి పాత్రలో అదరగొట్టేశాడు. కానీ.. సన్నివేశాలు తీసిన విధానం బాగోకపోవడంతో ఆయన శ్రమ వృధా అయినట్లేనని చెప్పాలి.
ఇక అభిమన్యు సింగ్ పోషించిన వీకేస్ట్ క్యారెక్టర్స్ లో ఇదొకటని చెప్పాలి. విలన్ అంటే అరవడం, కరవడం, తన్నులు తినడామేనా? అన్నట్లు ఉండిపోతుంది. మరి 9 ఏళ్ల క్రితం సినిమా కదా.
ఇక కోటా శ్రీనివాసరావు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, మధునందన్ వంటి బోలెడు మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ.. పెద్దగా కామెడీ పుట్టలేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకులు బి.గోపాల్ 2012లో తీసిన సినిమా కూడా 1980 కథాంశం తీసుకున్నారు. బలాదూర్ గా తిరిగే కొడుకు, అది చూసి బాధపడే తండ్రి, తండ్రిని బెదిరించే విలన్. సడన్ గా మారిపోయే కొడుకు. ఈ పంధాలో ఇప్పటికీ చాలా సినిమాలోచ్చాయి. అంతెందుకు మొన్నామధ్య వచ్చిన రామ్ “కందిరీగ” కూడా అదే ఫార్మాట్ సినిమా. కానీ.. సంతోష్ శ్రీనివాస్ కాస్త నవ్యత జోడించి తీశాడు. అందువల్ల ఫాదర్ సెంటిమెంట్ బాగా ఎలివేట్ అయ్యింది. సినిమా కూడా ఓ మోస్తరుగా ఆడింది. కానీ.. బో.గోపాల్ మాత్రం ఇంకా సమససింహా రెడ్డి దగ్గరే ఆగిపోయారు. దర్శకుడిగా మాస్ సినిమాలకు ఆధ్యుడు అనే చెప్పాలి. కానీ.. మారుతున్న తరంతో పాటు ఆయన కూడా అప్డేట్ లేదా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మణిశర్మ సంగీతం, బాలమురుగన్ సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విశ్లేషణ: ఇన్నాళ్లపాటు ల్యాబులో మగ్గిన ఈ చిత్రాన్ని ఉన్నట్లుండి థియేటర్లో విడుదల చేయాలనే ఆలోచనే పెద్ద రిస్క్. ఇక హీరోహీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరూ ప్రమోట్ చేకపోవడం, విడుదల చేసిన ట్రైలర్స్ & సాంగ్స్ ఆడియన్స్ ను థియేటర్లకు రాబట్టగలిగేవి కాకపోవడంతో.. ఈ “ఆరడుగుల బుల్లెట్” కమర్షియల్ సక్సెస్ సాధించడం కష్టమనే చెప్పాలి.