మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తరువాతి చిత్రం అయిన ‘ఆచార్య’ కు సంబంధించి ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే ‘ఆచార్య’ సినిమా కథ నాదే అంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ ఇచ్చాడు. తాను రచించిన ‘పుణ్యభూమి’ అనే నవలలో ‘ధర్మస్థలి’ ఎపిసోడ్ ను ఆధారంగా ఈ ‘ఆచార్య’ ను తెరకెక్కించినట్టు అతను ఆరోపణలు వ్యక్తం చేసాడు.ఇదిలా ఉండగా…. రాజేష్ మండూరి అనే మరో రచయిత ‘తాను రాసుకున్న కథని రెండేళ్ల క్రితమే ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతలకు వినిపించానని….
‘మైత్రి’ వారికి కొరటాల శివకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని… వాళ్ళే తన కథని కొరటాలకు ఇచ్చేసారు’ అంటూ ఆరోపించాడు. ఇదిలా ఉంటే…వేంపల్లి గంగాధర్ అనే మరో రచయిత అల్లు అర్జున్ – సుకుమార్ ల ‘పుష్ప’ కథ నాదే అన్నట్టు పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నాడు. తన ‘తమిళ కూలి’ అనే కథ ‘సాక్షి’ లో ప్రచురించబడిందని.. దానినే లేపేసి సుకుమార్ ‘పుష్ప’ గా తీస్తున్నాడు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతని అనుమానాలు నిజం అనడానికి ఎటువంటి ఆధారం లేదు.
కనీసం ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ ను బట్టి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కరెక్టు అని చెప్పడం లేదు. సినిమా చూస్తేనే కానీ అది నిజమని చెప్పలేము. అయితే… సుకుమార్ ‘పుష్ప’ గురించి అప్పుడే అంచనా వెయ్యలేము. మరి ఆ రచయిత ఏ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడో…!