మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో సినిమాపై బజ్ పెరిగిపోయింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణ విషయాల్లో దర్శకుడు కొరటాల శివ కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా తన సినిమాలను ఏ ఏ ఏరియాల్లో ఎంతకి అమ్మాలనే విషయంలో కొరటాల ఓ ఫిగర్ అనుకుంటారు.
తను అనుకున్న నెంబర్ బయ్యర్లు ఇచ్చినప్పుడే సినిమాను అమ్ముతాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాం ఏరియాలోనే నలభై కోట్ల రేషియాలో రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పుడు సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం మేకర్లు ముందుగా రూ.80 కోట్లు డిమాండ్ చేశారు. కానీ అంత మొత్తం పెట్టి రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో దర్శకనిర్మాతలు ముప్పై కోట్లు తగ్గించి రూ.50 కోట్ల దగ్గర ఆగారు. శాటిలైట్ రైట్స్ కోసం యాభై కోట్లు చెల్లిస్తేనే డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నారు. మొత్తం తెలుగు, తమిళ, కన్నడ భాషల శాటిలైట్ రైట్స్ కలిపి రూ.50 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. ఈ హక్కులను దక్కించుకోవడం కోసం ఓ పక్క సన్ టీవీ గ్రూప్, మరోపక్క జీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. రేటు మరింత తగ్గించే విధంగా బేరాలు మొదలెట్టారు. మరి ఏ రేటుకి డీల్ కుదురుతుందో చూడాలి. మే 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.