అర్జున్ సార్జా.. ఈ పేరు మనకి కొత్తేమో కానీ.. యాక్షన్ కింగ్ అర్జున్ అనే పేరుని నాలుగు దశాబ్దాలుగా వింటున్నాం. తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు అర్జున్. నటనతో పాటు సామాజిక సేవ చేయడానికి కూడా ముందుంటారు అర్జున్. కాకపోతే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికే ఆయన ఇష్టపడుతుంటారు. ఈయన ఆంజనేయ స్వామి భక్తుడు కూడా.! అందుకే చెన్నయ్ లోని ఎయిర్ పోర్ట్ దగ్గర అర్జున్ కు కలిగిన స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ ఆలయ కుంభాభిషేకం జూలై 1న జరగనుంది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు అర్జున్. అర్జున్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చెన్నైలో 15 సంవత్సరాల క్రితం నేను చేపట్టిన ఆంజనేయస్వామి గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జులై 1, 2 తేదీల్లో కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. స్నేహితులు, అభిమానులు, నాకు తెలిసిన వాళ్లందరినీ ఈ వేడుకకి ఆహ్వానించాలనుకున్నాను. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవ్వరినీ ఆహ్వానించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.
అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో లైవ్ ఏర్పాటు చేస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మీరు పొందొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. 2004 లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రని పోషించాడు అర్జున్. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఈయనలో పుట్టిందట.