ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం గత రెండు రోజులుగా రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పటికే ఓసారి ఖండించిన కుటుంబ సభ్యులు మరోసారి బుధవారం ఖండించారు. తొలుత అనారోగ్యం వార్తలను ఖండించిన టీమ్.. ఇప్పుడు మృతి వార్తలను కూడా ఖండించింది. ‘మా నాన్న క్షేమం’ అంటూ ఆయన కుమార్తె స్పందించారు. దీంతో ధర్మేంద్రకు ఏమైంది, ఎందకీ కన్ఫ్యూజన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Dharmendra
ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారంటూ మంగళవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మంగళవారం సాయంత్రం సన్నిహితులు తెలిపారు. ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని, కుటుంబ గోప్యతను అందరూ గౌరవించాలని అప్పుడు టీమ్ వెల్లడించింది. ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు అంటూ మరోసారి వార్తలొచ్చాయి. కానీ ఆయన క్షేమంగానే ఉన్నారంటూ భార్య హేమమాలిని, కూతురు ఇషా డియోల్ సోషల్ మీడియాలో తెలిపారు.
ఎన్నో హిట్ చిత్రాల్ని బాలీవుడ్‌కి అందించిన ధర్మేంద్ర వచ్చే నెల 8న 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వయసులోనూ ఆయన నటిస్తుండటం గమనార్హం. త్వరలో విడుదల కానున్న ‘ఇక్కీస్’లో ఓ కీలక పాత్రలో నటించారు.