కొంతమంది నటులను చూస్తే… ఈ నటుడిలో ఏదో టాలెంట్ ఉంది మంచి నటుడు అవుతాడు అనిపిస్తుంది. అయితే లక్ కలసి రాక ఇబ్బందిపడుతుంటారు. ఇప్పుడు అచ్చంగా అలానే అనిపించుకుంటున్న నటుడు కార్తిక్ రత్నం. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ఆ తర్వాత ‘నారప్ప’, ‘అర్ధ శతాబ్దం’ సినిమాలతో మెప్పించాడు. ఇప్పుడు ‘చాంగురే బంగారురాజా’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సినిమాకు స్టార్ హీరో రవితేజ (Ravi Teja) నిర్మాత. ఈ సినిమా విడుదల సందర్భంగా కార్తిక్ రత్నం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కామెడీ చేయడం అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన కార్తిక్‌రత్నం… ఈ సినిమాలో గంభీరమైన లుక్, వాయిస్‌తో నటించారు అని చెప్పాడు. అలాగే ‘నారప్ప’ సినిమానే తనకు ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చింది అని చెప్పాడు. ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసిన సతీశ్ వర్మనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఒక రోజు దర్శకుడ సతీష్ వర్మ ఫోన్ తనకు చేసి ‘మన సినిమా ఓకే అయ్యింది, రవితేజ నిర్మిస్తున్నారు’ అని చెప్పారట. రవితేజ అంటే ఎవరో నిర్మాత అనుకున్నాడట తొలుత కార్తిక్ రత్నం. అయితే ఆ రవితేజ మాస్ మహారాజా రవితేజ అని తెలిసి చాలా ఆనందించాడట. ఎందుకంటే రవితేజను దగ్గర నుండి చూస్తే చాలు అని చాలా సార్లు అనుకున్నాడట. అలాంటి అతని నిర్మాణంలో సినిమా అనేసరికి ఆ ఆనందం ఇంకెంత ఉంటుందో చెప్పండి.
ఈ సినిమా తర్వాత సుహాస్‌తో కలసి ‘శ్రీరంగనీతులు’ అనే సినిమా చేస్తున్నాడు కార్తిక్ రత్నం. ఆ తర్వాత ప్రకాశ్‌రాజ్ – ఎ.ఎల్.విజయ్ నిర్మించిన ఓ సినిమాతో వస్తాడు. రంగురాళ్ల నేపథ్యంలో ‘చాంగురే బంగారు రాజా’ సినిమా తెరకెక్కింది. రియలిస్టిక్ సీన్స్‌తో ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.