టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మురళీ మోహన్ తనకు సంబంధించిన జయభేరీ సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్న వార్తల గురించి స్పందించారు తమ సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారం నిజమేనని ఆయన తెలిపారు. అయితే తమ సంస్థ మాత్రం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని మురళీ మోహన్ పేర్కొన్నారు.
Murali Mohan
హైడ్రా అధికారులు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు వల్లే తమ సైట్ కు వచ్చి బఫర్ జోన్ లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉందని గుర్తించారని చెప్పుకొచ్చారు. ఈ షెడ్ ను తామే తొలగిస్తున్నామని మంగళవారం సాయంత్రం సమయానికి తాత్కాలిక షెడ్ ను తొలగించడం జరుగుతుందని మురళీ మోహన్ (Murali Mohan) పేర్కొన్నారు. తాను రియల్ ఎస్టేట్ రంగంలో 33 సంవత్సరాలుగా ఉన్నానని తాను ఎప్పుడూ అవకతవకలకు పాల్పడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
విజిటర్స్ పార్కింగ్ కోసం ఆ షెడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని మురళీ మోహన్ (Murali Mohan) తెలిపారు. హైడ్రా అధికారులు నిబంధనలు అతిక్రమించిన భవనాల విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చినా వీలైనంత త్వరగానే ఆ షెడ్ ను తొలగిస్తామని మురళీ మోహన్ చెప్పడం కొసమెరుపు. కొన్ని రోజుల క్రితం నాగార్జునకు (Nagarjuna) సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేయడం ఒకింత సంచలనం అయింది.
అయితే హైడ్రా అధికారులు ఎక్కువ సంఖ్యలో భవనాలను కూల్చివేస్తున్నా సెలబ్రిటీల ప్రాపర్టీల గురించి మాత్రమే మీడియాలో హైలెట్ అవుతోంది. మురళీ మోహన్ వివరణతో వివాదాలకు చెక్ పడుతుందేమో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా గురించి మాత్రం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.