బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు మురళీ శర్మ. తాజాగా ఆయన ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం.. ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే మురళీ శర్మ తల్లి పద్మ గారు గత రాత్రి గుండెపోటుతో మరణించారు. ముంబైలోని వారి స్వగృహంలో ఈమె మరణించినట్టు తెలుస్తుంది.ఆమె వయసు 76 సంవత్సరాలు. ఈమె మరణ వార్త తెలియగానే.. ఒక్కసారిగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఎక్కువ మంది మురళీ శర్మను కలుసుకోలేకపోతున్నారని సమాచారం.
ఇక హిందీలో పాపులర్ అయినప్పటికీ మురళీ శర్మ మన తెలుగువాడే కావడం విశేషం. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు అన్న సంగతి చాలా మందికి తెలీదు. మహేష్ బాబు- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘అతిథి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మురళీ శర్మ. ఆ తరువాత ఎన్టీఆర్ ‘కంత్రి’.. రానా ‘కృష్ణం వందే జగద్గురుం’…రాంచరణ్ ‘ఎవడు’ పవన్ కళ్యాణ్, వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ చిత్రాల్లో నటించాడు.
అయితే నాని- మారుతీ కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం మురళీ శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుండీ ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ అయిన ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో కూడా ఈయన నటించారు. మురళీ శర్మ సినీ కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టైంలో ఆయన తల్లి పద్మగారు ఎంతో ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేశారట. ఇప్పుడు ఆయన తల్లి దూరమవడం బాదా కరమైన విషయం అనే చెప్పాలి.