ఒకప్పుడు విలన్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన సోనూసూద్ గతేడాది లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయాల వల్ల రియల్ హీరోగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో సైతం కష్టాల్లో ఉన్న ప్రజలకు సోనూసూద్ తన వంతు సహాయం చేస్తున్నారు. విలన్ గా సోనూసూద్ లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా పేదల కష్టాలు తీర్చడం కోసం సోనూసూద్ కోట్ల రూపాయలు సహాయం చేస్తుండటం గమనార్హం. కష్టాల్లో ఉన్న ప్రజలకు సోనూసూద్ తరచూ సహాయం చేస్తుండటంతో ఈ హీరో ఆస్తులకు సంబంధించి ప్రజల్లో చర్చ జరుగుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలలో చాలామంది చేసిన సహాయానికి ప్రచారం కావాలని కోరుకుంటారు. అయితే సోనూసూద్ మాత్రం ప్రచారం కంటే ప్రజల కష్టాలను తీర్చడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసి సోనూసూద్ ఏకంగా 22 మంది ప్రాణాలను కాపాడారు. అయితే తాజాగా ఒక బాలీవుడ్ సంస్థ సోనూసూద్ ఆస్తుల వివరాలను వెల్లడించింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సోనూసూద్ ఆస్తుల విలువ 140 కోట్లు అని తెలుస్తోంది. ఆ డబ్బుతోనే ప్రస్తుతం సోనూసూద్ పేదలకు, వలస కార్మికులకు సహాయం చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలోని చాలామంది సెలబ్రిటీలతో పోలిస్తే సోనూసూద్ ఆస్తులు చాలా తక్కువ అయినప్పటికీ సోనూసూద్ మాత్రం తన సహాయాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం సోనూసూద్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. భవిష్యత్తులో సోనూసూద్ పాజిటివ్ రోల్స్ లో నటించాలని భావిస్తున్నారు.