సినిమాల్లో ఒక్క విజయం వస్తే ఫేమ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫేమ్‌తో వరుస సినిమాలు వస్తాయి. వాటి ఎంపికలో కాస్త అటు ఇటుగా వ్యవహరిస్తే మొత్తం పరిస్థితి తలకిందులవుతుంది. పాత్రలకు మంచి పేరు వచ్చినా, వసూళ్లు లేకపోవడం ఇబ్బందిపడుతుంటారు. మరీ అంత దారుణమైన పరిస్థితి కాకపోయినా కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు యువ విలక్షణ నటుడు సుహాస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరో అయిన సుహాస్‌ను (Suhas) చూసి ఇలాంటి నటులు తమిళంలో ఎక్కువ ఉంటారు కదా అనే కామెంట్లు వినిపించాయి.
ఆ మాటల్ని పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ వెళ్తున్నాడు సుహాస్. ఇప్పుడు కోలీవుడ్ నుండి ఆయనకు పిలుపొచ్చింది. కోలీవుడ్ కమెడియన్ హీరో సూరి నటిస్తున్న తాజా సినిమా ‘మందాడి’లో సుహాస్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, కాంతార ఫేమ్ అచ్యుత్ లాంటి నటులు నటిస్తున్నారు. ఇప్పుడు సుహాస్‌ను కూడా తీసుకున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కాబట్టే సుహాస్‌ను తీసుకున్నారని సమాచారం.
అయితే, ఇక్కడ పాయింట్ ఏంటంటే.. సుహాస్ లాంటి విలక్షణ నటుణ్ని కోలీవుడ్ తిరిగి మళ్లీ టాలీవుడ్‌కి పంపిస్తుందా అని. ఎందుకంటే సుహాస్ నటన అక్కడివారికి బాగా నచ్చుతుంది. అన్నీ అనుకుంటున్నట్లుగా జరిగితే సుహాస్ హీరోగా తమిళంలో ఓ సినిమా స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటు హీరోగా నటిస్తూనే, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘జాట్’లో ఓ పాత్రలో కనిపించాడు. ఇక చేతిలో మరో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.
తెలుగులో సుహాస్ సినిమాలు చూస్తే ‘కేబుల్ రెడ్డి’, ‘ఆనందరావు అడ్వంచెర్స్’, ‘ఉప్పుకప్పురంబు’ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే రీసెంట్ ఫామ్ చూస్తే సుహాస్‌కి 2024లో సరైన విజయాలు అయితే దక్కలేదు. ఆరు సినిమాలు వస్తే అందులో సరైన విజయం అందుకున్నవి ఒకట్రెండు అంటే పరిస్థితి తెలుసుకోవచ్చు. ఈ సమయంలో కోలీవుడ్‌కి వెళ్లడం ఎంతవరకు మంచి ఫలితం వస్తుంది అనేది చూడాలి.