సీనియర్ హీరో వేణు ఓటీటీ ఎంట్రీ ఇస్తూ చేసిన వెబ్ సిరీస్ ‘అతిథి’. సెప్టెంబర్ 19 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 6 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా హీరో వేణు తొట్టెంపూడి పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవి మీ కోసం :
ప్ర) ‘అతిథి’ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?
వేణు : లాక్ డౌన్ టైమ్ లో నేను కూడా వెబ్ సిరీస్ లు చూడటం అలవాటు చేసుకున్నాను. ఆ టైమ్ లో నేను కూడా ఒక వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ‘అతిథి’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కలిసి నాకు కథ వినిపించారు. బాగా నచ్చింది. భరత్ నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. నన్ను నమ్మి ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయాలని నాకు అనిపించింది.
ప్ర) ‘రామారావు ఆన్ డ్యూటీ’ కి మీరు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.. ‘అతిథి’ కి కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా?
వేణు : లేదు..! ఇప్పుడు నా గొంతు అంతగా బాలేదు. తర్వాత మళ్ళీ ట్రై చేస్తా..!
ప్ర)’అతిథి’ కి వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది?
వేణు : పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. కొందరు క్లాసీగా ఉందని, మరికొందరు మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ ఇందులో హారర్ అనే కాకుండా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.
ప్ర) మీ రీ ఎంట్రీ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.. మీరు దాన్ని ఎలా తీసుకున్నారు?
వేణు : అది నేను చెయ్యాలి అనుకుని చేసిన సినిమా కాదు. మా ఫ్రెండ్స్ అందరూ చేయాలనుకున్న సినిమా కాబట్టి.. నేను కూడా చేశాను. కాబట్టి నేను దాని ఫలితాన్ని సీరియస్ గా తీసుకోలేదు.
ప్ర) హారర్ జోనర్ లో చేయడం ఇదే మొదటిసారి కథా.. ఎలా అనిపించింది?
వేణు : అవును.! కొంచెం కష్టమే..! ఈ వెబ్ సిరీస్ లో నేను చేసిన రవివర్మ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసేందుకు చాలా కష్టమైంది. ఎందుకంటే ఈ కథలో అతనికి అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్లు ఉండాలి. ఎక్కువ, తక్కువ కాకుండా బ్యాలెన్స్ గా ఉండాలి. మిగతా క్యారెక్టర్స్ కు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. నాకు మాత్రం డబ్బాలో పెట్టినట్లు బిగించారు. దర్శకుడు భరత్ ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీరు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయాలి చెప్పాడు. నా పర్ఫార్మెన్స్ కు మంచి పేరు వస్తుంది అంటే ఆ క్రెడిట్ అతనిదే..!
ప్ర) ప్రవీణ్ సత్తార్ .. ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంది?
వేణు : ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ కాబట్టి…ఆయన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. మాతో డిస్కస్ చేసేవారు. సెట్ కి రాలేదు కానీ అన్నీ తెలుసుకునేవారు. “అతిథి” కోసం ఆయన మంచి ఎఫర్ట్ పెట్టారు.
ప్ర) రీ ఎంట్రీలో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
వేణు : రీ ఎంట్రీ అని మీరు అనుకుంటున్నారు. నా వరకు నేను 10 ఏళ్లకు ముందు నటుడినే.. ఇప్పుడూ నటుడినే..! నా వరకు ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయగలిగే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. నాగార్జున గారి ‘అన్నమయ్య’ వంటి పాత్ర చేయాలని ఉంది. అలా అనమాట..!
ప్ర) త్రివిక్రమ్ గారు మీకు మంచి ఫ్రెండ్ కదా.. ‘అతడు’ లో సోనూసూద్ రోల్ ను ఎందుకు చేయలేదు?
వేణు : ‘అతడు’ సినిమాలో సోనూసూద్ క్యారెక్టర్ లో నేను చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదు. త్రివిక్రమ్ గారు నాకు సెట్ అయ్యే పాత్ర ఉంది అంటే ఇప్పుడైనా ఎగిరి గంతేసి ఓకే చెబుతాను.
ప్ర) ‘దేశముదురు’ కూడా మీరు చేయాల్సిన సినిమా అట నిజమేనా?
వేణు : అవును.. కొన్ని కారణాల వల్ల ‘దేశముదురు’ కూడా చేయలేకపోయాను.!
ప్ర) మంచి ప్రాజెక్ట్స్ మిస్ అయ్యాను అని ఎప్పుడైనా బాధపడ్డారా?
వేణు : లేదు..! హిట్ సినిమాలు మిస్ అయ్యాయి అనే బాధ ఎప్పుడూ లేదు. కానీ నేను ఎంపిక చేసుకున్న సినిమాలు డిజప్పాయింట్ చేశాయి అని మాత్రం బాధపడుతూ ఉంటాను. ఇదొక సముద్రం, అలలు వస్తుంటాయి, కొన్నిసార్లు సునామీలు కూడా వస్తాయి. నా నెక్స్ట్ ప్రాజెక్టు ముందు ప్రాజెక్టు కంటే బెటర్ గా ఉండాలి అని మాత్రం పరితపిస్తూ పనిచేస్తాను.
ప్ర) గతంలో మీరు టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు కదా?
వేణు : మా బావగారు నామా నాగేశ్వరరావు గారితో కలిసి ఒకసారి సైకిల్ పై ప్రచారానికి వెళ్ళాను. ఇప్పుడు ఆయన బి.ఆర్.ఎస్ లో ఉన్నారు.
ప్ర) చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినందుకు టాలీవుడ్ నుండి ఎవరూ స్పందించలేదు అని డిస్కషన్ జరుగుతుంది.. దానికి మీరేమంటారు?
వేణు : ‘ఎందుకు స్పందించడం లేదు సినిమా వాళ్ళు’ అంటే నా దగ్గర సమాధానం లేదు. నా (Venu Thottempudi) వరకు అయితే అది కక్ష్య సాధింపు చర్య అనిపించింది. అందుకు నాకు బాధగా ఉంది.
ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
వేణు : చాయ్ బిస్కెట్ వారి ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాను. సూర్య అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది