‘ఫోటో’ అనే తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది అంజలి. ఆ తర్వాత ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట్ హీరోగా నటించిన ‘ప్రేమలేఖ రాశా’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఈమెకు కలిసి రాలేదు. దీంతో అందరిలానే ఈమె తొందరగానే ఫేడౌట్ అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ తమిళ ప్రేక్షకులు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు. ‘షాపింగ్ మాల్’ ‘జర్నీ’ వంటి సినిమాలతో అంజలి అక్కడ సక్సెస్ అయ్యింది.
ఇంకా చాలా సినిమాల్లో హీరోయిన్ గా (Anjali) నటించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వగా… ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఆ తర్వాత ఈమెకు సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడం జరిగింది. మొన్నామధ్య ఈమె బరువు పెరగడంతో అవకాశాలు తగ్గిపోయాయి అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ బిజీ అవుతుంది అంజలి.
రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తుంది. మరోపక్క విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రంలో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి రెండు మంచి ప్రాజెక్టులే. అంతేకాకుండా అంజలి 50వ చిత్రం ‘ఈగై'(తమిళ మూవీ) కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ మూవీతో సైలెంట్ గా 50 సినిమాలు కంప్లీట్ చేసేసింది ఈ రాజోలు బ్యూటీ.