నటి హేమకు డిగ్రీ కావాలట. అందుకోసం ఆమె డిగ్రీ అర్హత పరీక్షకు హాజరయ్యారు. ఓ పరీక్ష సెంటర్ లో ఎగ్జామ్స్ రాస్తున్న హేమ మీడియా కంటపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో హేమ ఎగ్జామ్ సెంటర్ కాగా బంధువుల ఇంట్లో ఉంటూ ఈ పరీక్షకు హాజరయ్యారట. రెండేళ్లుగా డిగ్రీ అర్హత పరీక్ష రాయాలని హేమ అనుకుంటున్నారట. వరుస సినిమాల వలన వీలు కాలేదట. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కొంచెం గ్యాప్ రాగా హేమ డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది.
డిగ్రీ కోర్స్ లో చేరడానికి హేమ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్ష రాశారు. కొన్ని కంప్యూటర్ కోర్స్ లు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నారట. 7వ తరగతి వరకు చదువుకున్న హేమ ఆ తరువాత సినిమా కోసం చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారట. 53ఏళ్ల వయసులో హేమ ఉన్నత చదువులు చదవాలనుకోవడం విశేషం. నటిగా ఎన్నో పాత్రలు చేసిన హేమ ఈ వయసులో చదువు పట్ల ఆసక్తి చూపడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా హేమకు అందరూ మద్దతు పలుకుతున్నారు. 30ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్న హేమ అనేక రకాల పాత్రలు చేశారు. అతడు మూవీలో బ్రహ్మానందం భార్యగా హేమ నటన ఎవర్ గ్రీన్ అనాలి. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న హేమ మొదటివారమే ఎలిమినేటై వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం హేమ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు.