‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయ్యింది లక్ష్మీ రాయ్. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే పెద్దగా ఆఫర్లేమీ రాలేదు. తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని బాలకృష్ణ తో ‘అధినాయకుడు’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం చాలా సార్లు విడుదల వాయిదా పడుతూ రావడంతో… మంచి సినిమా అని పేరు తెచుకున్నప్పటికీ విజయం సాధించలేకపోయింది. దీంతో లక్ష్మీ రాయ్ కి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ వైపు మళ్ళింది.
అక్కడ అడపా…దడపా సినిమాలూ చేస్తూనే తెలుగులో ‘బలుపు’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలలో ఐటెం సాంగ్స్ తో ఆడిపాడింది. ఇక అటు పై బాలీవుడ్ వైపు వెళ్ళి ‘జూలీ’ అనే బోల్డ్ చిత్రం చేసింది. ఈ చిత్రంలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేసినప్పటికీ.. సినిమా హిట్ అవ్వలేదు. ఇక దీంతో మళ్ళీ టాలీవుడ్ వైపు తిరిగొచ్చింది. తాజాగా లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కిశోర్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఎం. శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలు.
ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా లక్ష్మీ రాయ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘మీటూ’ ఉద్యమం పై అడిగిన ప్రశ్నకి ఆసక్తికరమైన సమాధానమిచ్చింది లక్ష్మీ రాయ్. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.. “మీటూతో గొప్ప మార్పులేం రాలేదు. మీటూ ఉద్యమం ఎప్పుడో ముగిసింది. దీనిని ప్రజలు కూడా మర్చిపోయారు. ఉద్యమం మరిన్ని రోజులు కొనసాగి… పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించాను. కానీ దురదృష్టవశాత్తూ మార్పులేం చోటు చేసుకోలేదు. లైంగిక వేధింపుల పై ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడిన కొంతమంది మహిళలను నేను గౌరవిస్తా.
కొందరు మాత్రం ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. ప్రతీకార ఉద్యమంగా మార్చేశారు. ‘నువ్వు నాకు బ్రేక్ ఇవ్వలేదు కదా. నీ గురించి మాట్లాడతా’ అని ఫేమస్ కావడానికి టీవీల ముందుకు వచ్చారు. ఎక్కడో ఉద్యమ తీవ్రత తగ్గి… గొప్ప ఫలితాలు రాలేదు. మీటూలో భాగంగా చాలామంది బయటకొచ్చి మాట్లాడారు. వాటిలో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది ఇండస్ట్రీలో జనాలకు అర్థం కాలేదు. ఇక, ఇండస్ట్రీతో సంబంధం లేని ప్రజల పరిస్థితి ఊహించుకోండి. వాళ్ళకు ఏమీ అర్థం కాలేదు”… అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది లక్ష్మీ రాయ్.