నువ్వే నువ్వే, చిరుత, ఏమైంది ఈ వేళ ఇలాంటి చిత్రాల్లో తల్లి కారెక్టర్లతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఎన్నో చిత్రాల్లో మంచి మంచి క్యారెక్టర్లు చేసారు నటి ప్రగతి. తల్లిగా, అత్తగా, అక్కగా ఇలా అన్ని రకాల పాత్రలకు తనకు మాత్రమే సొంతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ నటి. ఈ మధ్య సినిమాలలో కంటే జిమ్ లోనే ఎక్కువగా కనపడటంతో ట్రోల్ కి గురైంది ప్రగతి. రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ప్రగతి మాట్లాడుతూ కంటతడి పెట్టడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

అయితే, తాను సినిమాలు మానెయ్యలేదని, ఎప్పటికి మానెయ్యబోనని చెప్తూ… తన ఇంటి రెంట్ దగ్గర నుంచి తాను తినే ప్రతి మెతుకు సినిమా నుంచి వచ్చిందే అని అన్నారు. సినిమా అవకాశాలు తగ్గిన గ్యాప్ లో తాను జిమ్ లో పవర్ లిఫ్టింగ్ మీద దృష్టి పెట్టానన్నారు. ఆ సమయంలో చాలా మంది చాలా దారుణంగా అసభ్యంగా మాట్లాడారని, దాంతో తాను ఎంతో బాధ పడ్డానని కంట తడి పెట్టారు. ఒకానొక సమయంలో అయితే తాను జిమ్ కి వెళ్లి తప్పు చేస్తున్నానా అని సందేహపడ్డానని, తనకి కాలేజ్ కి వెళ్లే కూతురు ఉందని తన మీద ఏ ప్రభావం పడొద్దు అని దేవుణ్ణి కోరుకునేదానిని అని అన్నారు. జిమ్ కి చీరలు కట్టుకొని వెళ్లలేము కదా అని, ప్రతి ఇంట్లో ఆడవారు ఉంటారని ఒక్కసారి అది ఆలోచించుకొని కామెంట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. పిచ్చి కూతలు కూసిన ప్రతి ఒక్కరికి నేను ఇండియా తరపున సాధించిన ఘనతే సమాధానం అని, ఆ మెడల్ ను సినీ రంగంలో తమ పాత్రలను పోషిస్తున్న ప్రతి ఒక్క నటీ మణికి డేడికేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నటి ప్రగతి.
రీసెంట్ గా డిసెంబర్ 6న టర్కీ లో నిర్వహించబడ్డ ఆసియన్ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ లో 84 కేజీల విభాగంలో ప్రగతి ఇండియా తరపున బరిలోకి దిగి సిల్వర్ మెడల్ సాధించి దేశానికే గర్వకారణంగా నిలవటంతో నెటిజన్లు ప్రగతిని ప్రశంసిస్తున్నారు.
