ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే మొదట ఇంట గెలిచి, తర్వాత రచ్చ గెలుస్తుంటారు. కానీ అదేం దరిద్రమో తెలియదు కానీ.. పాపం మన తెలుగమ్మాయిలు మాత్రం మొదట రచ్చ గెలిస్తే తప్ప ఇంట గెలవడం పక్కన పెడితే కనీసం గుర్తింపు కూడా లభించదు. అంజలి, శ్రీదివ్యలు అందుకు ఉదాహరణలు. తాజాగా ఆ జాబితాలో చేరింది మరో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. 2013 మిస్ ఇండియా అయిన ఈ అమ్మడు బాలీవుడ్ లో “రమణ్ రాఘవ్, కాలా కండి” వంటి చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులో అవకాశం వరించింది.
అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “గూఢచారి” చిత్రంతో శోభిత తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన శోభిత చాలా విషయాలు చెప్పింది. మొదట్లో మోడలింగ్ చేద్దామనుకొన్నప్పుడు, సినిమాల్లో రోమాంటిక్స్ సీన్స్ లో యాక్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు చాలా ఎక్కువగా విభేదించారట. అయితే.. తాను వాటిని పెద్దగా కేర్ చేయలేదని, తన తల్లిదండ్రులు అర్ధం చేసుకోవడంతో మిగతా విషయాలను అసలు పట్టించుకోలేదని చెప్పింది శోభిత. ఇకపై తెలుగు సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నానని చెప్పిన శోభిత.. “గూఢచారి”తో తనకు ఎలాంటి ఇమేజ్ వస్తుందోనని వెయిట్ చేస్తోందట.