Varalaxmi: వాళ్లు నన్ను ఊహించుకుంటున్నారు? ఇంకేం కావాలి: వరలక్ష్మి శరత్‌ కుమార్‌!

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎనర్జిటిక్‌ నటి ఎవరు అని లిస్ట్‌ రాస్తే.. తొలి స్థానాల్లో కనిపించే భామ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) . హీరోయిన్‌గా సినిమాల్లోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా విభిన్నమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. అలా ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘శబరి’. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో వచ్చే నెల 3న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ కెరీర్‌ గురించి, తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది అని చెప్పిన వరలక్ష్మి ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ తనపై ఉండదని చెప్పింది. తెలుగు ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమే తనను హైదరాబాద్‌కి మారిపోయేలా చేసిందని చెప్పింది. తానొక నటినని, మనసుకు నచ్చిన ఏ పాత్రనైనా చేయడానికి సిద్ధమే అని చెప్పింది. తల్లిగా నటించడం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు అలా సమాధానం ఇచ్చింది.

ఆమె చెప్పినట్లు తల్లిగా నటించడం కొత్తేం కాదు, తమిళంలో చేసిన మొదటి సినిమాలోనే బిడ్డకి తల్లిగా నటించింది. ఇమేజ్‌ని పట్టించుకోకుండా నటించడం ఆమెకు అలవాటు. అందుకే హీరోయిన్‌ మెటీరియల్‌ అయినప్పటికీ అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తోంది. లాయర్‌గా, చెల్లెలిగా నటించినా, ప్రతినాయిక పాత్రలు ప్రేక్షకులు స్వీకరించారని, వాళ్లకు కావాల్సింది మంచి కథ అని మరోసారి అలా చెప్పారని వరలక్ష్మి అంటోంది.

దర్శకులు కథలు రాస్తున్నప్పుడు, ఆ పాత్రల్లో తనను ఊహించుకుంటున్నారు అని… ఒక నటికి అంతకుమించి ఏం కావాలి? అని మురిసిపోయింది వరలక్ష్మి. థియేటర్‌ నుండి బయటికి వచ్చే ప్రేక్షకుడు తన నటనను వేలెత్తి చూపించకుండా ఉంటే చాలు అనేది తన నియమం అని చెప్పింది. మరి పెళ్లి సంగతేంటి వరు అని అడిగితే… ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నా అని క్లారిటీ ఇచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus