ఎనిమిదేళ్ల క్రితం ‘కోచ్చడయాన్’ అనే సినిమా వచ్చింది తెలుసా? ఈ ప్రశ్నకు సగటు సినిమా అభిమాని అయితే ‘అవును తెలుసు అయితే’ అని అంటారు. అదే రజనీకాంత్ అభిమాని అయితే ‘ఆ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు, ఆ గాయం గుర్తు చేయడం ఎందుకు?’ అని విసుక్కుంటారు. అంతలా రజనీకాంత్ అభిమానుల్ని ఇబ్బంది పెట్టిన సినిమా అది. రజనీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే హారతులిచ్చే అభిమానులున్న ట్రెండ్‌లో రజనీని బొమ్మలా చూపించడం ఏంటి అని విసుక్కున్నారు ఇప్పుడు.
త్వరలో ఇదే పరిస్థితి ప్రభాస్ అభిమానులకు కూడా కలగబోతోందా? అవుననే అంటున్నారు నెటిజన్లు. కారణం ‘ఆదిపురుష్’ టీజరే అని చెప్పొచ్చు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందింది అని చెబుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అందులో ప్రభాస్‌ను చూసి ఏంటి.. ఇలా ఉన్నాడు అని అనుకున్నారు సగటు అభిమానులు. టెక్నాలజీ గురించి తెలిసినవాళ్లు ‘ప్రభాస్‌ను బొమ్మను చేశారు కదయ్యా’ అంటూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ కటౌట్‌ని బొమ్మలా చూపించడం ఎవరికీ నచ్చదు.
ఫైట్స్‌లో హీరోలకు డూప్‌లు ఉంటేనే ఇప్పుడు ఫ్యాన్స్ నచ్చడం లేదు. అలాంటిది ఏకంగా హీరోను బొమ్మగా చూపించడం ఏ అభిమానికీ నచ్చదు. గతంలో ‘కోచ్చడయాన్’ సినిమా వచ్చినప్పుడు కూడా రజనీ ఫ్యాన్స్ ఇదే మాట అన్నారు. ఆ సినిమాను ఆయన తనయ సౌందర్యనే తెరకెక్కించారు. ఆమెను కొంతమంది నేరుగా ఇదే విషయం అడిగారు అని కూడా అప్పుడు వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి దర్శకుడు ఓం రౌత్‌కి ఇలాంటి ప్రశ్నే ఎదురవుతుంది అని అంటున్నారు.
‘కోచ్చడయాన్’ సినిమాలో రజనీకాంత్ లుక్ విషయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే అప్పటికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్లు ‘ఆదిపురుష్’కి పని చేశారు అని అంటున్నారు. సాంకేతిక విషయంలోనూ చాలా మార్పులొచ్చాయి. కాబట్టి సినిమా లైవ్లీగా ఉంటుంది అని చెబుతున్నారు. మరి ‘ఆదిపురుష్’ విషయంలో ఏమవుతుందో చూడాలి.