టీజర్ విడుదలయ్యక ఏ సినిమా టీమ్ కూడా పడని మాటలు, ఇబ్బందులు ‘ఆదిపురుష్’ సినిమా టీమ్ ఎదుర్కొందని చెప్పాలి. మామూలుగా అయితే టీజర్ బాగోలేకపోతే బాగోలేదు, చెత్తగా ఉంది, ఇలా కట్ చేశారు ఏంటి.. అంటూ కొన్ని ప్రశ్నలు వేసి వదిలేస్తారు. కానీ ‘ఆదిపురుష్’ విషయంలో అలా జరగలేదు. టీజర్‌ను, టీమ్‌ని, సినిమా, ఆలోచనను మొత్తంగా ఏకి పారేస్తున్నారు. కోపాలు, తిట్లు, ట్రోలింగ్స్, మీమ్స్.. ఇలా ఒక్కటేంటి ఎన్నో జరుగుతున్నాయి. అయితే దీనిని కంట్రోల్ చేయడానికి టీమ్ రెడీ అయ్యింది.
‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయ్యాక.. దాని గురించో, సినిమా గురించో టీమ్ మాట్లాడలేదు. బహిరంగ సభ ఉంటుంది అని చెప్పినా.. అదేమైందో అర్థం కావడం లేదు. లైవ్ సరిగ్గా రాలేదు, తర్వాత వీడియో ఫుటేజ్ కూడా రాలేదు. దీంతో మాట్లాడలేదా? మాట్లాడితే చూపించలేదా అనేది తెలియదు. అయితే ఇప్పుడు కామెంట్స్ వర్షం కురుస్తుండటంతో ఈ సినిమా గురించి టీమ్ నోరు విప్పే ప్రయత్నం చేస్తోంది. అలా తమ ఆలోచనను కూడా చెప్పబోతోంది. దీని కోసం సినిమా త్రీడీ టీజర్ లాంచ్‌ను వేదికగా చేసుకుంటోంది అని సమాచాం.
‘ఆదిపురుష్’ త్రీడీ టీజర్‌ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేశారు. ఏఎంబీ మాల్‌లో ఈ టీజర్‌ను ప్రదర్శిస్తారట. ఆ తర్వాత ప్రభాస్ అండ్ కో. మీడియాతో మాట్లాడతారట. ఈ క్రమంలో సినిమా గురించి, టీజర్ గురించి వస్తున్న విమర్శల గురించి తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. పీఆర్ టీమ్ ఈ విధంగా నష్టనివారణ చర్యలు చేపడుతోంది అని అంటున్నారు. అయితే ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, దానికి ఓం రౌత్ ఏం అంటారు అనేది చూడాలి. గత అనుభవాల ప్రకారం చూస్తే… ప్రభాస్ ఇలాంటి విషయాలపై పెద్దగా స్పందించడు.
‘ఆదిపురుష్’ టీజర్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. రామాయణంలోని పాత్రలను అపహాస్యం చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ జోడించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.