ఇన్నాళ్లూ ‘ఆదిపురుష్’ సినిమా గురించి చర్చ వస్తే.. సినిమా భారీతనం గురించి, ప్రభాస్ గురించి మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు వేరే విషయం మాట్లాడుకుంటున్నారు. అదే సినిమా విజువల్ ఎఫెక్ట్స్. అవేవో అద్భుతంగా వచ్చాయని కాదు. అసలు అవొక విజువల్ ఎఫెక్ట్సేనా అంటూ పెదవి విరుస్తున్నారు. అసలు ఈ వర్క్ చేసింది ఎవరు అంటూ ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంకొందరు అయితే అజయ్ దేవగణ్ టీమే చేసింది అంటూ తేల్చేశారు. తాజాగా దీనిపై అజయ్ దేవగణ్ టీమ్ స్పందించింది. తమకు ఆ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.
‘ఆదిపురుష్’ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేందుకు శాంపిల్‌గా ఆదివారం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మీరు కూడా చూసే ఉంటారు. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బొమ్మలతో గారడీ చేశారంటూ దర్శకుడు ఓం రౌత్ విమర్శించారు. గ్రాఫిక్స్, యానిమేషన్ చౌకబారుగా ఉన్నాయని మండిపడ్డారు. కార్టూన్స్‌లో యానిమేషన్ ఇంకా బాగుంది అంటూ కామెంట్స్ కూడా చేశారు.
మోషన్ క్యాప్టర్ యానిమేషన్‌లో టీజర్‌ను రూపొందించడంతో ఆ పాత్రలు సహజత్వాన్ని కోల్పోయాయి. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ బొమ్మల మాదిరిగా మారిపోవడం అభిమానులకు నచ్చలేదు. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఈ పుకార్లపై ఆ సంస్థ స్పందించింది. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
‘ఆదిపురుష్’ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మేం చేయలేదు అని NY VFXWaala ఆ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదిపురుష్’ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ తమ టీమ్ చేయలేదని స్పష్టం చేసింది. కొంతమంది మీడియా ప్రతినిధులు తమను ప్రశ్నించడంతో ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాం అని కూడా చెప్పింది. NY VFXWaala వీఎఫ్ఎక్స్ స్టూడియోను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌కి చెందినది.
వీఎఫ్ఎక్స్ నిపుణులు నవీన్ పాల్, ప్రసాద్ సుతార్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం అజయ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ దేవగణ్ నటించిన ‘శివాయ్’, ‘తానాజీ’ సినిమాలకు ఈ స్టూడియో పనిచేసింది. ‘శివాయ్’ సినిమాకి గానూ నేషనల్ ఫిలిం అవార్డును కూడా అందుకుంది. ‘తానాజీ’ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. అందుకే NY VFXWaalaతో ఓం రౌత్ ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ చేయించుకున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇదులో నిజం లేదని ప్రకటనతో అజయ్ దేవగణ్ కంపెనీ స్పష్టం చేసింది.