ఇప్పుడు అద్దాల మేడలో ఉన్నవారు.. పుట్టినప్పటి నుండి అందులోనే ఉన్నారు అని అనుకోలేం. ఎన్నో కష్టాలు పడితే కానీ ఆ స్థాయికి వచ్చి ఉండరు. అలా ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారు.. పుట్టుకతోనే స్టార్లు కాదు. ఎన్నో డక్కాముక్కీలు తింటే కానీ ఇక్కడ వరకు రారు. అలా వచ్చిన హీరోల్లో అజిత్ ఒకరు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా ఆధిపత్యం చలాయిస్తున్న అజిత్ (Ajith Kumar).. ఇండస్ట్రీకి వచ్చింది ఈ స్థాయి కథానాయకుడు అవుదామని కాదు. కేవలం తన వ్యాపారం కోసం గతంలో చేసిన అప్పుడు తీర్చడానికే.
అవును మీరు చదివంది నిజమే. ఆయనే ఈ మాటలు చెప్పారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తర్వాత అజిత్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తన కెరీర్, ఇష్టాయిష్టాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అనుకోకుండా నటుడిని అయ్యానని, కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఎవరైనా యాక్టింగ్‌కు సంబంధించిన ప్రశ్న అడిగితే ఏమీ తెలియదు అనేలా ఉండేవాడినని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు అజిత్.
తనకు మొదట్లో ఒక తెలుగు సినిమా టీమ్‌కి ఆడిషన్ ఇచ్చే అవకాశం వచ్చిందని, అయితే ఆ సమయంలో తనకు తెలుగు మాట్లాడటం రాదని, దీంతో నేర్చుకోవాలని ప్రయత్నించానని తెలిపాడు. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని చెప్పగానే తల్లిదండ్రులు ఆందోళన చెందారని, తమ కుటుంబంలో ఇప్పటివరకూ ఎవరూ సినిమా పరిశ్రమలో లేరని గుర్తు చేశారని చెప్పారు. అయితే ఎలాగోలా వారికి సర్దిచెప్పి ఇండస్ట్రీకి వచ్చానని అజిత్ చెప్పాడు. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, గుర్తింపు సాధించా అని చెప్పుకొచ్చాడు అజిత్.
ఇంత సాధించిన సినిమా పరిశ్రమలోకి ఎలా వచ్చారు అని అడిగితే.. నా వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాను. అవి తీర్చడం కోసం ఇండస్ట్రీకి వచ్చాను. తీసుకున్న అప్పు ఎంత కష్టమైన పనైనా చేసి చెల్లించాలని అనుకున్నాను. అందుకే తెలియని రంగంలోకి వచ్చి కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు అజిత్. ఇక తొలి రోజుల్లో తన సినిమాలకు మరొకరితో డబ్బింగ్ చెప్పించేవారట. నా యాస బాలేకపోవడమే కారణం అని చెప్పాడు అజిత్. .