తెల్ల జుట్టు.. పొడవాటి తెల్ల గడ్డంతో ఓ వ్యక్తి… చేతిలో మెషీన్ గన్.. ఇదీ ఓ పోస్టర్ కనిపిస్తోంది. అయితేనేం ఇప్పుడు ఆ పోస్టర్, దానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పోస్టర్ వచ్చి 12 గంటలు అయిపోయినా.. ఇంకా ఆ పోస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే ‘తునివు’ పోస్టర్. అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న సినిమా లుక్ అది. ఈ సినిమా పేరును రివీల్ చేస్తూ ఆ పోస్టర్ వదిలారు. ఇప్పుడు ఆ సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ప్రకారం అయితే ఈ సినిమా 1987లో పంజాబ్‌లో జరిగిన ఓ బ్యాంకు రోబరీ నేపథ్యంలో సాగుతుంది. ఓ పదిహేను మంది సిక్కులు పోలీసుల్లా మారి చేసిన చోరీ ఇదట. పోలీసుల తరహాలో మెషీన్ గన్లు, రైఫిల్స్‌తో ఓ బ్యాంకులో దూరి సుమారు 45 లక్షల డాలర్లు చోరీ చేస్తారు. ఇది ఇప్పటివరకు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు రాబరీగా చెబుతుంటారు. ఈ చోరీలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, చాలా ప్లానింగ్‌తో ఆ చోరీ చేశారట. ఈ మొత్తం వ్యవహారం ఆధారంగా ఈ సినిమా ఉంటుంది అంటున్నారు.
ఈ చోరీకి ముందు ఏం జరిగింది, చోరీ తర్వాత ఏం జరిగింది లాంటి వివరాలు ఈ సినిమాలో చూడొచ్చు అంటున్నారు. అయితే ఆ ఘటననే చూపిస్తారా? లేక దానిని స్ఫూర్తిగా తీసుకొని ఓ కథ అల్లుకొని సినిమా చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ‘తునివు’ సినిమాను హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్నారు. ‘నేర్కొండ పార్వై’, ‘వాలిమై’ తర్వాత అజిత్ – వినోద్ చేస్తున్న సినిమా ఇది. జీ స్టుడియోస్ , బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు.
మంజు వారియర్ ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి. అయితే సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. విడుదల తేదీ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పోస్టర్‌తో ప్రచారం ప్రారంభించిన చిత్రబృందం త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.