12వ శతాబ్దం నాటి కథ ఒకటి, 14 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒకటి. ఈ మరో రెండు రోజుల్లో ఈ రెండు కథల మధ్యే పోటీ నడుస్తోంది. అయితే ఇది కేవలం రెండు కథల మధ్య పోటీ కాదు… బాలీవుడ్, టాలీవుడ్ మధ్య పోటీ అంటున్నారు ట్రేడ్ పండితులు. అందులో అక్షయ్ కుమార్, అడివి శేష్ మధ్య పోటీగా చిత్రిస్తున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరమో తెలియదు కానీ.. ఈ శుక్రవారం పోటీ మాత్రం వారి మధ్య. అందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. ఇక అడివి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంఆ రూపొందిన చిత్రం ‘మేజర్’. తొలి సినిమా బాలీవుడ్‌ది అయితే, రెండోది పాన్ ఇండియా మూవీ. ఈ రెండు సినిమాలు జూన్ 3న విడుదలవుతున్నాయి. మామూలుగా అయితే అక్షయ్ కుమార్‌తో అడివి శేష్‌కి పోటీయా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
సౌత్ నుండి పాన్ ఇండియా సినిమాలు వెళ్తున్న చిత్రాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో వస్తున్న సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఇప్పుడు ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘మేజర్’ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే.. శేష్ సినిమాకే ఎడ్జ్ కనిపిస్తోంది. ప్రచారమూ, హైప్ కూడా ఆ సినిమాకే ఎక్కువగా ఉన్నాయి. దీంతో మూడో తేదీన విజేత ఎవరవుతారు అనే ప్రశ్న వస్తోంది. ఈసారి కూడా అక్షయ్ ఆకట్టుకోకపోతే బాలీవుడ్ పరిస్థితి మళ్లీ నష్టాల బాటే అంటున్నారు.
మామూలుగా అయితే బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సినిమాలకు పరాజయం అనేదే ఉండదు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా మంచి వసూళ్లే వస్తుంటాయి. ఆయన సినిమాల ఎంపిక కూడా అంత బాగానే ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఆయన సినిమాల సెలక్షన్ కూడా కాస్త ఆందోళనకరంగానే ఉంటోంది. అదే అసలు సమస్య. చూద్దాం మూడో తేదీ ఏమవుతుందో?