ఆలియా భట్… ఇండస్ట్రీలోకి వచ్చి 11 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల కాలంలో ఆమెకు ఎన్ని హిట్లు వచ్చాయి, ఎన్ని పురస్కారాలు వచ్చాయి అనేది పక్కనపెడితే.. ఆమెను వెంటాడని వివాదాలు లేవు, ఆమెను అనని నోళ్లు లేవు. నెపో కిడ్ అని, నాలెడ్జ్ తక్కువ అని చాలా ఘోరంగా ఆమెను విమర్శించిన నోళ్లు లేవు. ఓ టీవీ షోలో ఆలియా చెప్పిన జీకే సమాధానం ఆమెను బాగా డీపాపులర్ చేసింది. కంగారులో చెప్పిన మాట ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ‘గంగూబాయి కాఠియవాడి’తో బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచి… విమర్శకుల నోళ్లు మూయించింది.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అంటూ 2012లో తొలిసారి కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించిన ఆలియా… అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. మహేష్ భట్ తనయ కదా అవకాశాలొస్తున్నాయి, కరణ్ జోహర్ సన్నిహితురాలు కదా అందుకే అవకాశాలు వస్తున్నాయి అంటూ తొలి నాళ్లలో ఆమె అంటే గిట్టని వాళ్లు కామెంట్స్ చేశారు. అలా ఆని ఆమె యాక్టింగ్ రాదు అని ఎవరూ అనలేదు. ఎందుకంటే మహేష్ భట్ బాలీవుడ్‌కి ఇచ్చిన బెస్ట్ ఏదైనా ఉందా అంటే ఆలియా భట్ అనే కామెంట్ కూడా మీరు వినే ఉంటారు.
అయితే ఆలియా భట్ (Alia Bhatt) నుండి ఫ్లాప్ సినిమా వచ్చిన ప్రతిసారి విమర్శకుల నోళ్లు రెడీగా ఉండేవి. ఆమె కంటే బెస్ట్ చాలామంది ఉన్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కేవారు. ఇందులో కొంతమంది బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. అయితే ఆలియా వాటికి ఎప్పుడూ వెరవలేదు. అలా అని సన్నిహితుల సినిమాలతో సరిపెట్టుకోలేదు. ప్రతి సినిమాను తనను తాను మార్చుకుంది. పాత్రల ఎంపికలో ప్రయోగాలు చేసింది. ఇప్పుడు అవార్డు తెచ్చిపెట్టిన ‘గంగూబాయి కాఠియావాడి’ కూడా ప్రయోగమే. ఈ సినిమా కోసం ఆలియా చాలా మారింది.
లుక్, మాట తీరు, నడవడిక.. ఇలా అన్నింట్లో ఈ సినిమాలో ఆలియా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వెర్సటాలిటీనే ఆమెను బెస్ట్ నటిని చేసింది. కెరీర్ తొలినాళ్లలోనే ‘హైవే’, ‘2 స్టేట్స్’, ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’, ‘అగ్లీ’, ‘కపూర్ అండ్ సన్స్’,‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’ లాంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంది. ఆ తర్వాత ‘రాజీ’తో తనలో మరో కోణాన్ని జనాలకు చూపించింది. ఆ వెంటనే ‘గల్లీ బాయ్’, ‘కళంక్’ సినిమాలు ఆమెకు బెస్ట్ అసెట్‌గా నిలిచాయి.
అప్పుడు సరిగ్గా అప్పుడు వచ్చింది ఈ ‘గంగూభాయి కాఠియావాడి’. గంగూబాయి యుక్త వయసులో ఓ వ్యకిని ఇష్టపడి అతడిని నమ్మి ఇంట్లో నుంచి పారిపోయి ముంబయికి వస్తుంది. ఆమె అమాయకత్వంతో మోసం చేసి అక్కడి కమాఠీపురలోని ఓ వేశ్య గృహంలో అమ్మేస్తాడు. ఆ తర్వాత ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని గంగూబాయ్… ‘మేడమ్ ఆఫ్ కమాఠీపుర’గా ఎదుగుతుంది. సినిమాలో ఈ మొత్తం సిరీస్‌లో ఆలియా అంటే ఆషామాషీ కాదు అని నిరూపించింది. దీంతో ఇప్పటికైనా ఆమెను తక్కువ చేసే ట్రోలింగ్స్ ఇక ఆగుతాయేమో చూడాలి.