తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత చిత్ర రాజం.. అపురూపం.. అజరామరం.. ‘మాయాబజార్’.. తరాలు మారినా ఈ చిత్రం యొక్క చరిత్ర అనేది చెక్కు చెదరదు.. ప్రస్తుతం రీ రిలీజుల హవా నడుస్తున్న తరుణంలో ఇలాంటి అద్భుత దృశ్యకావ్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం అభినందనీయం.. 1957 మార్చి 27న విడుదలైన ‘మాయాబజార్’.. 2022కి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టీవీల్లోనూ, బ్లాక్ అండ్ వైట్ డీవీడీల్లోనూ చూసిన ఈ తరం వాళ్లకి థియేటర్లో ఆ అద్భుతాన్ని చూసే అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి.
గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ వారు ‘మాయాబజార్’ చిత్రాన్ని కలర్ మరియు డిజిటల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేశారు.. మార్చడానికి వీలుపడని కొన్ని సీన్లు వదిలేశారు. 2010 జనవరి 30న కలర్ వెర్షన్ రిలీజ్ చేయగా.. చూసిన వాళ్లంతా.. కన్వర్ట్ చేసిన వాళ్ల ప్రయత్నం అనేది మెచ్చుకోతగ్గదే కానీ.. సీన్లు తీసెయ్యడం వల్ల సోల్ మిస్ అయిందని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు మరికొంత మెరుగులు దిద్ది మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
డిసెంబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో, సెలెక్టెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి నైజాం థియేటర్ల లిస్ట్ వచ్చింది.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35 ఎంఎం (ఉదయం 8:10 స్పెషల్ షో), కూకట్‌పల్లి విశ్వనాథ్ లాంటి సింగిల్ స్క్రీన్లతో పాటు.. మూసాపేట్ లక్షీకళ, ప్రసాద్ ఐమాక్స్, గచ్చిబౌలి ఏఎంబీ సినిమాస్‌తో పాటు అన్ని పాపులర్ మల్టీప్లెక్సుల్లోనూ షోలు వేయబోతున్నారు. ఆనాటి వెండితెర అద్భుత మాయాజాలాన్ని మళ్లీ చూడబోతుండడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్‌వీఆర్, సావిత్రిల అసమాన నటన, కె.వి. రెడ్డి దర్శకత్వ ప్రతిభ, మార్కస్ బార్ట్లే కెమెరా వండర్స్, విజయా వారి నిర్మాణ విలువలు, పింగళి రాసిన మాటలు, పాటలు.. సాలూరి, ఘంటసాల గీతాలు ఆబాల గోపాలాన్నీ అలరించాయి.. 65 సంవత్సరాలే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ‘మాయాబజార్’ కీర్తి ప్రతిష్టలు అలానే ఉంటాయి.. అప్పట్లో రోజుకి మూడు ఆటలు వేసే వాళ్లు కాస్తా ఏకంగా ఐదు, ఆరు షోలు వేసేవాళ్లంటే డిమాండ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 24 కేెంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుని చరిత్ర సృష్టించింది..