సీనియర్ క్రికెటర్ బయోపిక్ కోసం కామెడీ హీరో.. న్యాయం చేయగలడా?

బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao), మరోసారి తన విభిన్నమైన పాత్రల ఎంపికతో వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ‘స్త్రీ 2’తో (Stree 2) భారీ హిట్ అందుకున్న రాజ్, త్వరలో ఓ స్పోర్ట్స్ బాయోపిక్‌లో నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ట్రాప్‌డ్, సాక్స్‌షో వంటి సీరియస్ కంటెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్న విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించబోతున్నారు. ఇది పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో రూపుదిద్దుకునే సినిమా కాబోతుంది. ఇప్పటికే పలు క్రికెట్ బయోపిక్స్ వచ్చినా, ఈసారి మాత్రం కథ మరింత వ్యక్తిగత కోణానికి వెళ్లబోతుందని సమాచారం.

Sourav Ganguly

ఎప్పటినుంచో చర్చల్లో ఉన్న ‘సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బయోపిక్’ ఇది కావచ్చన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టిమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ జీవితం, ఆటలో అందించిన సేవలు, అతడి కెరీర్‌లోని కీలక మలుపులు, కెప్టెన్సీ స్టైల్.. ఇవన్నీ ఈ సినిమాలో చూపించనున్నారని టాక్. అయితే ఇది కేవలం క్రీడాప్రముఖుడి ఆట విశ్లేషణకే పరిమితంగా ఉండదట. గంగూలీ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ప్రేమాయణం, వివాదాలు, బీసీసీఐతో తలెత్తిన తగాదాలు వంటి అంశాలు కూడా స్క్రిప్ట్‌లో కీలకంగా ఉండబోతున్నాయి.

ఇదంతా తెరకెక్కించేందుకు రాజ్‌కుమార్ రావు సరైన ఎంపికేనా? కామెడీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన ఈ నటుడు గంగూలీ లాంటి మాస్ స్పోర్ట్స్ ఐకాన్ పాత్రకు న్యాయం చేయగలడా? అనే డౌట్స్ కొందరిలో వ్యక్తమవుతున్నాయి. కానీ రాజ్‌కుమార్ రావుకు భిన్నమైన పాత్రల్లో నటించడంలో మంచి అనుభవం ఉంది. సీరియస్ రోల్స్‌లోనూ అదిరే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ నటుడు గంగూలీ పాత్రకు ప్రిపేర్ కావడానికి ట్రైనింగ్ తీసుకోనున్నాడని సమాచారం.

షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలన్నది డైరెక్టర్ ప్లాన్ అయినా, ముందు నటీనటులతో విపరీతమైన వర్క్‌షాపులు జరుగుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రాజ్ ప్రస్తుతం వామికా గబ్బితో కలిసి నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాడు. మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఒకవేళ గంగూలీ బయోపిక్ అధికారికంగా అనౌన్స్ అయితే, అది బాలీవుడ్‌లో క్రికెట్ బయోపిక్స్‌లో మరో బిగ్ చాప్టర్‌గా నిలవనుందని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus