‘అల్లరి’ చిత్రంతో కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు నరేష్. పెద్ద హీరోల చిత్రాలకి టికెట్లు దొరక్కపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ను అల్లరి నరేష్ సినిమాకి వెళ్ళి దింపుకునేవారు. అందులోనూ కామెడీ చిత్రాలకి తన తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన ఇ.వి.వి.సత్యనారాయణ కూడా పెట్టింది పేరు కాబట్టి నరేష్ కు పెద్ద ప్లస్ అయ్యింది. వరుసగా సంవత్సరానికి 8 సినిమాలు చేసినా అందులో కనీసం 5 హిట్లు కొట్టేవాడు. ప్లాపయినా పెద్దగా నష్టాలు వచ్చేవి కాదు. కామెడీ సినిమాలనే కాదు ‘నేను’ ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి చిత్రాలలో తను సంపూర్ణ నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తన తండ్రి మరణం తర్వాత సరైన కథల్ని ఎంచుకోవడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇక కామెడీ చిత్రాలకి కూడా జనాలు థియేటర్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. కేవలం ‘జబర్దస్త్’ వంటి షో లతో సరిపెట్టేసుకుంటున్నారు.
దీంతో అల్లరి నరేష్ కు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి టైం లో మహేష్ ‘మహర్షి’ చిత్రంలో అవకాశం వచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో ‘రవి’ పాత్రలో అల్లరి నరేష్ 100 కు వంద శాతం న్యాయం చేసాడని చెప్పడంలో సందేహం లేదు. సినిమా కి సోల్ అల్లరి నరేష్. ఒక దశలో మహేష్ ను బాగా డామినెటే చేసేస్తున్నాడనే ఫీలింగ్ కూడా వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ చిత్రంతో అయినా అల్లరోడికి మంచి ఆఫర్లు.. అందులోనూ ఇలాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి.