ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది ‘నాయట్టు’ అనే మలయాళం మూవీ. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడి నిర్మాతకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా మొత్తం తిప్పి కొడితే 3 లేదా 4 లొకేషన్లు మాత్రమే ఉంటాయి. 2 షెడ్యూల్స్ లో షూటింగ్ మొత్తం ఫినిష్ చేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. అలాగే ఈ చిత్రం కథనం కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముగ్గురు పోలీసులు వారు చెయ్యని క్రైమ్ లో ఇరుక్కుంటారు.
నిజానికి వారు ఏ తప్పు చేయరు. కానీ పోలీస్ వ్యవస్థే వీళ్ళని నేరస్థులుగా సృష్టించి శిక్ష పడేలా చేయాలనుకుంటుంది. కులం, రాజకీయాలకి పోలీస్ వ్యవస్థ తలవంచి న్యాయాన్ని పక్కన పెట్టి… నిజానిజాల్ని దాచేస్తుందని వాస్తవిక సంఘటనలతో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంగేజింగ్ గా తెరకెక్కించారు అక్కడి మేకర్స్. ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ ‘నాయట్టు’ ని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు.
అందుకు ‘పలాస’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల దర్శకుడు కరుణకుమార్ ను ఎంపిక చేసుకున్నారు.స్క్రిప్ట్ రెడీ అయ్యింది… రావు రమేష్, అంజలి వంటి స్టార్ క్యాస్ట్ ను కూడా ఎంపిక చేసుకుని….పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యం అనుకున్న టైములో ఈ రీమేక్ కి బ్రేక్ పడినట్టు అయ్యింది. రీమేక్ రైట్స్ విషయంలో నిర్మాణ సంస్థకి … మలయాళ నిర్మాతలకూ(నాయట్టు నిర్మాతలకి) చెడిందని తెలుస్తుంది.
అందుకే ఈ నాయట్టు రీమేక్ నిలిచిపోయిందట. భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్ట్ ఉండకపోవచ్చని టాక్. దర్శకుడు కరుణ్ కుమార్ కూడా వేరే అవకాశాలు కోసం గాలింపు మొదలుపెట్టాడు. ఏమైనా మంచి కథాబలం ఉన్న ఈ చిత్రం రీమేక్ అయ్యి ఉంటే బాగుండేది. మంచి సినిమాని చూసే ఛాన్స్ జనాలకి మిస్ అయ్యింది.