ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తాడు అంటూ చాలా ఏళ్లుగా ఓ వార్త మన మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సినిమా ఏంటి, కథేంటి అనే విషయాలు బయటకు రావడం లేదు కానీ.. ముంబయిలోని భన్సాలీ ఆఫీసు దగ్గర ఒకట్రెండు సార్లు కనిపించాడు అని టాక్ అయితే ఉంది. అయితే రీసెంట్‌గా మరోసారి భన్సాలీని బన్నీ కలిశాడు అని అంటున్నారు. దీంతో మరోసారి ఆ సినిమా గురించి చర్చ మొదలైంది.
నిజానికి సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడేం ఖాళీగా లేరు. ‘లవ్ అండ్ వార్’ అనే ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా 2026లో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమా పనుల్ని ఇప్పటికిప్పుడు భన్సాలీ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ లెక్కన బన్నీ ఇప్పుడెందుకు భన్సాలీని కలిసినట్లు అనేదే ఇక్కడ ప్రశ్న.
మరోవైపు అల్లు అర్జున్ కూడా రెండు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడు. తొలుత త్రివిక్రమ్‌తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత అట్లీతో కానీ, సందీప్ రెడ్డి వంగాతో కానీ ఓ సినిమా చేస్తాడు. ఆ తర్వాతే వేరే సినిమా ఏదైనా ఉంటుంది. అంటే కనీసంలో కనీసం 2029కి బన్నీ ఫ్రీ అవుతాడు. ఈలోపు భన్సాలీ తన సినిమా రిలీజ్ చేసేసి బన్నీతో కోసం కథ రాయొచ్చు. ఈ లెక్కన సినిమా అవకాశం ఉంది.
కానీ ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత సినిమా కోసం ఇప్పుడు కలవడం ఏంటి అనేదే పాయింట్. దీంతో ఇప్పుడు భన్సాలీ చేస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమాలో ఏమన్నా కీలక పాత్ర కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే డౌట్ కూడా కలుగుతోంది. చూద్దాం ఈ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుంది అని కూడా అంటున్నారు.