ఈ టాలెంటడ్ అమ్మాయికి ముందే అవకాశాలు వచ్చాయట..!
- November 21, 2016 / 10:56 AM ISTByFilmy Focus
మైమరిపించే అందం, లౌక్యం ఉంటే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ రెండూ ఉండాలే కానీ ప్రతిభకి ఎలాగోలా పాస్ మార్కులు వేసేస్తారు మన దర్శక నిర్మాతలు. ఇలాంటి రోజుల్లోనూ అవకాశాలు వచ్చినా టాలీవుడ్ కి దూరంగా ఉంటూ వచ్చింది నందిత శ్వేత. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నిఖిల్ ఎన్ని మార్కులు వేయించుకున్నాడో అతగాడికి ధీటుగా నటించిన నందిత కూడా సరిసమానమైన మార్కులనే అందుకుంది. ఈ బెంగళూర్ భామకి తెలుగులో ఇదే తొలి సినిమా అయినా టాలీవుడ్ లో ఇప్పుడు ఈమె గురించి మాట్లాడని వారు లేరు.
ఆ స్థాయిలో తన ప్రతిభావంతమైన నటనతో అందరినీ మెప్పించింది నందిత. అయితే తమిళంలో నందిత వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు నందితను తెలుగు సీమకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారట. అయితే ఆ పాత్రలు పాటలకి, రొమాన్స్ కి పరిమితమయ్యే రకమట. అంచేత ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించిన నందిత ‘ఎక్కడికి పోతావు’ సినిమాలోని పాత్ర తీరుతెన్నులు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నందిత నటన ఆమె ఎంతగానో అభిమానించే అల్లు అర్జున్ కి కూడా నచ్చేసిందట. బన్నీ స్వయంగా ప్రశంసించేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోతుంది ఈ తమిళ సుందరి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















