ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ క్రేజ్ ఇప్పుడు జపాన్ గడ్డపైకి చేరింది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాను జనవరి 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఇండియాలో రికార్డులు తిరగరాసిన ఈ సినిమాకు, జపాన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. భారీ ప్రమోషన్లు చేసినప్పటికీ, మొదటి రోజు నంబర్స్ కొంచెం నిరాశపరిచేలా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
జపాన్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం, పుష్ప 2 మొదటి రోజు సుమారు 886 అడ్మిషన్స్ (ఫుట్ ఫాల్స్) మాత్రమే నమోదు చేసింది. ఇతర ఇండియన్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గతంలో ‘రంగస్థలం’ 1,610 ఫుట్ ఫాల్స్, ‘దేవర’ 1,550 ఫుట్ ఫాల్స్ సాధించగా, ఈ మధ్య వచ్చిన ‘కల్కి 2898 AD’ ఏకంగా 3,700 అడ్మిషన్స్ రాబట్టింది. ఈ లెక్కన చూస్తే అల్లు అర్జున్ సినిమా టాప్ 10 ఇండియన్ ఓపెనర్స్ లిస్టులో కూడా చోటు సంపాదించలేకపోయింది.
అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. జపాన్ ఆడియన్స్ ఏదైనా సినిమాను ఓన్ చేసుకోవడానికి కొంచెం టైమ్ తీసుకుంటారు. ‘RRR’ సినిమా కూడా అక్కడ స్లోగానే స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత లాంగ్ రన్‌లో సుమారు 8,230 అడ్మిషన్లతో మొదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పుష్ప 2 కూడా అదే రూట్‌లో వెళ్తుందేమో అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి రోజు కేవలం 40 లక్షల రూపాయల (7 మిలియన్ యెన్) గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టినట్లు సమాచారం.
నిజానికి జపాన్ లో పుష్ప 2ని దాదాపు 250కి పైగా థియేటర్లలో భారీగా రిలీజ్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న స్వయంగా టోక్యో వెళ్లి మరి ప్రమోషన్స్ చేశారు. అక్కడ జరిగిన ప్రీమియర్ షోలకు మాత్రం ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ అల్లు అర్జున్ మేనరిజమ్స్ కు, జపాన్ భాషలో ఆయన చెప్పిన డైలాగులకు ఫిదా అయిపోయారు. ఈ పాజిటివ్ టాక్ గనుక జపాన్ లోని లోకల్ ఆడియన్స్‌కు చేరితే, వీకెండ్ నాటికి నంబర్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో పుష్పరాజ్ తగ్గుతాడా లేక జపాన్ బాక్సాఫీస్ పై పట్టు సాధిస్తాడా అనేది చూడాలి.
