ఈ మధ్యకాలంలో మెగా హీరోల సినిమాలకి ట్వీట్స్ వేయనందుకు, పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనందుకు అల్లు అర్జున్ ట్రోలింగ్ కి గురయ్యారు. ఇక ఆదివారం నాడు కృష్ణంరాజు మరణిస్తే.. సంతాపం తెలియజేయకుండా సైమా అవార్డ్స్ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు బన్నీ. దీంతో చాలా మంది ఆయన్ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలోనే కాకుండా.. మీడియాలో కూడా బన్నీని టార్గెట్ చేస్తూ వార్తలొచ్చాయి.
సైమా అవార్డ్స్ ఫొటోలు షేర్ చేయడానికి టైం ఉంది కానీ కృష్ణంరాజుని ఉద్దేశిస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేకపోయారంటూ బన్నీపై కామెంట్స్ చేశారు. నిజానికి బన్నీ నేరుగా వెళ్లి కృష్ణంరాజు ఫ్యామిలీని కలుద్దామని అనుకున్నారు. చాలా మందిని తెలియని విషయం ఏంటంటే.. ప్రభాస్, బన్నీ మంచి స్నేహితులు. ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ తమ స్నేహం గురించి బయటకు పెద్దగా చెప్పేవారు కాదు.
కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే బన్నీ షాకయ్యారట. వెంటనే హైదరాబాద్ కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టలేదు. హైదరాబాద్ చేరుకున్న వెంటనే కృష్ణంరాజు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అలానే ప్రభాస్ ని హత్తుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ విధంగా ట్రోలర్స్ కి బన్నీ గట్టి సమాధానమిచ్చినట్లైంది. ఇక నుంచైనా.. బన్నీపై ఇలాంటి నెగెటివ్ ప్రచారం తగ్గుతుందేమో చూడాలి!