ఇండస్ట్రీలో ఓ శుక్రవారం వచ్చి వెళ్లగానే కథకులు, దర్శకులు, హీరోలకు కొత్త ఆలోచన వస్తుంది అంటారు. ఆ వారం రిలీజ్ అయిన సినిమాల్లో తమకు పనికొచ్చే పాయింట్ ఏమైనా ఉందా? వాటితో కొత్త కథ ఏదైనా రాసుకోవచ్చా, తమ సినిమాలో ఆ పాయింట్ ఇంకా బెటర్‌గా వాడుకోవచ్చు అనుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. అయితే అందులో ఆ పాయింట్ ఉంది, మనమూ పెట్టేద్దాం. ఆ హీరో అలాంటి సినిమా చేశాడు మనమూ అలాంటిదే చేసేద్దాం అనుకోకూడదు. అలా వాతలు పెట్టుకుంటే దెబ్బలు తింటాం అంటుంటారు సినిమా పెద్దలు.
ఈ అంశం గురించి ఇంకా వివరంగా అర్థం కావాలంటే టాలీవుడ్‌లో రీసెంట్ టైమ్‌లో రెండు సినిమాలు తీసుకుంటే తెలిసిపోతుంది. ఒకటి ‘బద్రినాథ్’ కాగా, రెండోది ‘శక్తి’. రాజమౌళి – రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ ఈ సినిమాలకు స్ఫూర్తి అని చెప్పొచ్చు. అందులో కథ, కథనం, పాత్రల చిత్రణ, లుక్… ఇలా చాలా స్ఫూర్తి తీసుకున్నారు అని చెప్పొచ్చు. అయితే ఈ రెండూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలోనూ ఇదే చేస్తున్నారా? ఇదే సోషల్ మీడియాలో తాజా చర్చ.
‘పుష్ప’ సినిమా విషయంలో ఇతర సినిమాలతో రెండు కంపారిజన్లు చేయొచ్చు. ఒకటి పాత్రల చిత్రణ, రెండోది ప్రచారం. తొలి విషయం అయితే ‘రంగస్థలం’ సినిమా చర్చలో కి వస్తుంది. ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ అదరగొట్టేశాడు. చాలా న్యాచురల్‌గా చిట్టిబాబు అయిపోయాడు. ఎక్కడా అతి కనిపించదు. అయితే ‘పుష్ప’రాజ్‌గా అల్లు అర్జున్ మేనరిజమ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎక్కడో చిన్న అతి కనిపిస్తోంది. దాంతోపాటు సహజత్వం కూడా లేదు. ఇక ప్రచారంలో మొత్తం రాజమౌళి సినిమాల్ని ఫాలో అవుతున్నారని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. సో… ‘బద్రినాథ్’ అవ్వకుండా బన్నీ – సుకుమార్ చూసుకోవాలి మరి.