సినిమా అభిమానం, సినిమా తారల అభిమానం అంటే.. ఒకప్పుడు అదో స్పెషల్, ఇప్పుడు కొంతమందిని చూస్తే ఆందోళకరంగా మారింది. ఏదో ఉన్మాదం తరహాలో ఆ అభిమానం చూపిస్తున్నారు. అభిమానం ఇలా కూడా ఉంటుందా అనేలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు అభిమానం గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా? ప్రముఖ నటి అమల ఇటీవల అభిమానుల గురించి చేసిన కొన్ని కామెంట్స్, గతంలో జరిగిన విషయాల ప్రస్తావనతో అభిమానం విషయం బయటకు వచ్చింది. అమల… తెలుగు, తమిళ, మలయాళ తదితర భాషల్లో ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం కథానాయిక.
లాంగ్ కెరీర్ కాకపోయినా చేసినా సినిమాల్లో అలరించి స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే నాగార్జునను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు కెమెరా ముందుకురాని ఆమె.. ఇప్పుడిప్పుడే సెలక్టివ్ పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. అలా వచ్చినవే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఒకే ఒక జీవితం’. అలాంటి అమల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత సినిమా గురించి మాట్లడారు. 1991లో వచ్చిన ‘ఎంటే సూర్యపుత్రికు’ అనే సినిమా గురించి చెప్పారు.
అందులో అమల (Amala) పాత్ర చాలా రెబలిష్‌గా ఉంటంఉది. ఆ మలయాళ సినిమాతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. అంతేకాదు ఆ సినిమా వల్ల కేరళ నుండి చాలామంది అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా అమల దగ్గరకు వచ్చేశారట. అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా ఉన్న ఆ సినిమా చూసి.. కేరళకు చెందిన చాలామంది అమ్మాయిలు తమ ఇళ్లు వదిలి పారిపోయి చెన్నైలోని అమల ఇల్లు వెతుక్కుని వచ్చేశారట. ఆ సినిమాలో చేసిన ఆ పాత్ర ఆ అమ్మాయిలకు ఎంతో నచ్చిందని..
అదే విషయాన్ని వాళ్లు చెబుతూ ‘‘మీరు మాలో స్ఫూర్తి నింపారు’’ అని చెప్పారని అమల తెలిపారు. అంతే కాదు అప్పుడు స్టార్‌డమ్ అంటే ఏంటో తొలిసారి చూశానన్నారు. అలా వచ్చి అభిమానం చూపించడం సంతోషపెట్టినా.. వాళ్లు చేసింది కరెక్ట్ కాదని నచ్చజెప్పాను అని అమలు తెలిపారు. ఆ తర్వాత మేనేజర్‌ను వాళ్లకు తోడుగా పంపించి మరీ ఇళ్లకు సురక్షితంగా చేరేలా చూశానని అమల తెలిపారు.