ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) , “RRR”తో(RRR) దేశానికే గర్వకారణంగా నిలిచాడు. ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరితో కలిపి ఒక సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకు రావడం అంటే అంత మాములు విషయం కాదు. అలాంటిది అందులో ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం ఆయన టాలెంట్‌కు నిదర్శనం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలలో చరణ్, తారక్ చూపించిన ప్రదర్శన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా ఉంది.
ఇక “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ సాధించడంతో, RRR కేవలం బాక్సాఫీస్ హిట్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు రాజమౌళి మరో సర్‌ప్రైజ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. RRR బిహైండ్ ది సీన్స్ గురించిన డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ డాక్యుమెంటరీలో సినిమా నిర్మాణం వెనుక జరిగిన ప్రతి చర్చను, ప్రతి సవాలను, తెర వెనుక కృషిని చూపించనున్నారు.
స్టార్ హీరోలను ఒకే చిత్రంలో తీసుకురావడం ఎలా సాధ్యమైంది, ఫ్యాన్స్‌కు న్యాయం చేయడానికి జక్కన్న ఏం ప్లాన్ చేశారో అన్న దానిపై విపులంగా వివరణ ఇస్తారని తెలుస్తోంది. “RRR బిహైండ్ & బియాండ్” పేరుతో వస్తున్న ఈ డాక్యుమెంటరీ, సినిమాకు సంబంధించిన గుండెను తాకే కథనాలను ప్రదర్శించబోతోంది. రెండు దేశాల్లో, వందల మంది టీమ్ తో చేసిన చిత్రీకరణ, గ్లోబల్ ప్రమోషన్ స్ట్రాటజీ, ఆస్కార్ నామినేషన్ చుట్టూ జరిగిన క్యాంపెయిన్ వంటి విషయాలు ఇందులో వుంటాయట.
ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారని సమాచారం. ఇదే కాకుండా, రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి పెట్టారు. మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాబోతున్న ఈ సినిమా 2025 ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.