కొరియోగ్రాఫర్లు మంచి స్టార్ డమ్ వచ్చాక దర్శకులుగా మారడం అనే ఆనవాయితీలో 18 ఏళ్ల క్రితమే “రణం” (Ranam) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) . గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, అనంతరం రవితేజ (Ravi Teja) పిలిచి మరీ చాన్స్ ఇస్తే “ఖతర్నాక్” (Khatarnak) అనే డిజాస్టర్ తీసి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. అనంతరం నితిన్ (Nithin Kumar) మరోసారి “టక్కరి” (Takkari)తో ఛాన్స్ ఇస్తే, దాంతో కూడా తన సత్తా చాటుకోలేక చతికిలపడ్డాడు.
Amma Rajasekhar
ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాలకు దర్శకత్వం వహించినా పెద్దగా పేరు రాలేదు. ఇక వేరే హీరోలు తనకు అవకాశమిచ్చే ఛాన్స్ లేదని గ్రహించిన అమ్మ రాజశేఖర్ తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తూ “తల” అనే సినిమా ఎనౌన్స్ చేయడంతోపాటుగా టీజర్ కూడా విడుదల చేసాడు. ఓ 16 ఏళ్ల కుర్రాడితో చేయించాల్సిన సినిమా ఇది కాదని టీజర్లో కంటెంట్ చూసినవాళ్లందరూ చెప్పగా.. “అమ్మ రాజశేఖర్ ఆన్ ఫైర్ అండ్ హీ ఈజ్ బ్యాక్” అని తనను తాను పుష్ చేసుకున్నాడు.
అమ్మ రాజశేఖర్ కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఆయనే స్వీయ నిర్మాణంలో రూపొందిస్తుండడం విశేషం. ఆయన సతీమణి రాధ నిర్మాణ సారథిగా వ్యవహరిస్తుండగా, ఆయన పెద్ద కుమార్తె జ్యోతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం అనేది విశేషం. ఇలా కుటుంబం మొత్తం కలిసి ఓ సినిమా మీద వర్క్ చేయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం.
రోహిత్, ఎస్తర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యిందట, త్వరలోనే రిలీజ్ చేస్తామని పాత్రికేయుల సమావేశంలో చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్. మరి ఈ కుటుంబం “తల” ఎత్తుకునేలా ఈ సినిమా ఉంటుందో లేదో ఇంకొన్ని నెలల్లో తెలిసిపోతుంది. అయితే.. ఇదే ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఖతర్నాక్ అలా తీయడం వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను అంటూ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది