మే 1 1974 లో విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ఈరోజుతో 46 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్ పై జి.హనుమంత రావు, జి.ఆది శేషగిరిరావు గారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు రిపీట్స్ లో కూడా వంద రోజులు ఆడిన ‘దేవదాస్’ ‘మాయాబజార్’ వంటి చిత్రాల సరసన ‘అల్లూరి సీతారామ రాజు’ కూడా చేరింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిపేసిన విప్లవ జ్యోతి అల్లూరి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. సూపర్ స్టార్ కృష్ణ గారి 100 వ చిత్రంగా రూపొందిన ‘అల్లూరి సీతారామరాజు’… ముందు మరో ఇద్దరు స్టార్ హీరోల వద్దకు కూడా వెళ్ళింది.
ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. ఏ.ఎన్.ఆర్ అలాగే ఎన్టీఆర్ వంటి బడా హీరోల వద్దకు వెళ్ళింది. అయితే కొన్ని కారణాల వల్ల ఏ.ఎన్. ఆర్ ఈ ప్రాజెక్ట్ ను చేయలేదు. ఇక ఎన్టీఆర్ కు ఈ పాత్ర చాలా బాగా నచ్చేసింది. దాంతో కథ రెడీ చేయించే ప్రయత్నాలు కూడా జరిగాయట. కానీ ఎన్టీఆర్ ఓ పట్టాన సంతృప్తి చెందలేదు అని తెలుస్తుంది. ‘అసలు ఈ పాత్ర నాకు సెట్ అవుతుందా లేదా’ అని పెద్దాయన కంగారు పడ్డారట. అందులోనూ అతనే నిర్మాతగా వ్యవహరించాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ ఉన్నారు.
ఇక మరోపక్క శోభన్ బాబుతో కూడా ఈ అల్లూరి జీవిత చరిత్రతో సినిమా తియ్యాలి అనే ప్రయత్నాలు జరిగాయట. అసలు వీటిని పట్టించుకోకుండా త్రిపురనేని మహారథి తో ఈ కథను తయారు చేయించి వెంటనే సెట్స్ పైకి తీసుకువెళ్ళడమే కాకుండా మిగిలిన వాళ్ళు… ఇంకా అదే ఆలోచనలో ఉండగానే ‘అల్లూరి సీతారామరాజు’ ని ఫినిష్ చేసి రిలీజ్ చేయించారు కృష్ణ. ఈ చిత్రం విడుదలయ్యింది అని తెలీకుండా పరిచూరి బ్రదర్స్ తో ‘అల్లూరి సీతారామరాజు’ స్క్రిప్ట్ ను రెడీ చేయించే ప్రయత్నాలు ఎన్టీఆర్ చేయడానికి రెడీ అయ్యారట. అయితే ఒకసారి కృష్ణ గారు చేసిన ‘అల్లూరి సీతారామరాజు’ చూడమని పరిచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ ను కోరారట. కృష్ణ గారు ఎన్టీఆర్ ఫోన్ చెయ్యగానే ఓ స్పెషల్ షో వేయించారట. అది చూసాక ఎన్టీఆర్ .. కృష్ణ గారిని మెచ్చుకోవడం .. ఇక అల్లూరి సినిమాని చెయ్యాలి అనే ఆలోచనని విరమించుకోవడం కూడా జరిగిందట. అది ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం వెనుక ఉన్న కథ.