‘ఆది’ తో ఎన్టీఆర్ మాస్ హీరో అయ్యాడు. దీనికి ముందు ఎన్టీఆర్ కి ‘స్టూడెంట్ నెంబర్ 1’ రూపంలో మంచి హిట్ ఉంది. ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. కానీ ఎన్టీఆర్ ని మాస్ హీరోగా చేసిన ఘనత దర్శకుడు వి.వి.వినాయక్ దే..! ఈ సినిమా ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ,నాగార్జున..లకి ఎన్టీఆర్ పెద్ద ఛాలెంజ్ విసిరినట్టు అయ్యింది. అంతేకాదు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
కొన్నిటికి కథలు మారాయి.. ఇంకొన్నిటికి దర్శకులే మారిపోయారు. అయితే ‘ఆది’ టైంలోనే ఎన్టీఆర్.. బి.గోపాల్ దర్శకత్వంలో ‘అల్లరి రాముడు’ అనే సినిమా చేయడానికి సైన్ చేశారు. బి.గోపాల్ దీనికి దర్శకుడు. అదే టైంలో ఆయన చిరంజీవితో ‘ఇంద్ర’ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. కానీ హైప్ మాత్రం ‘ఇంద్ర’ కంటే ఎక్కువగా ‘అల్లరి రాముడు’ పై ఉంది.
అందుకు మరో కారణం.. ‘ఇంద్ర’ కి ముందు చిరు చేసిన ‘మృగరాజు’ ‘డాడీ’ వంటివి ఫ్లాప్ అయ్యాయి. ‘డాడీ’ ఫలితం అయితే ‘చిరు మాస్ స్టామినా తగ్గిపోయింది’ అనే విమర్శలకు దారి తీసింది. ఫైనల్ గా ‘ఇంద్ర’ ‘అల్లరి రాముడు’ సినిమాలు ఒకే టైంలో కంప్లీట్ అయ్యాయి. జూలై 18 నే 2 సినిమాలు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ‘ఇంద్ర’ రిలీజ్ ను చిరు వారం రోజులు పోస్ట్ పోన్ చేద్దామని మేకర్స్ కి చెప్పారట. ఎందుకంటే ‘ఇంద్ర’ చిరుకి ఓ కొత్త అటెంప్ట్.
ఆడియన్స్ దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారో.. చెప్పలేని పరిస్థితి. అందుకే జూలై 24 కి ‘ఇంద్ర’ ని వాయిదా వేశారు. జూలై 18న ‘అల్లరి రాముడు’ రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. కానీ ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి. మొదటి వారమే బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చేశారు. జూలై 24న రిలీజ్ అయిన ‘ఇంద్ర’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ‘ఇంద్ర’ కనుక నెక్స్ట్ వీక్ లేకపోతే ‘అల్లరి రాముడు’ మరింతగా క్యాష్ చేసుకుని ఉండేది. కానీ ఎన్టీఆర్ ప్లాప్ సినిమా కూడా చిరుని సందిగ్ధంలో పడేసింది. ఎన్టీఆర్ మాస్ పవర్ గురించి చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు అనే చెప్పాలి.