‘బాహుబలి’ రెండు సినిమాలు కలిపి బిగ్ ‘బాహుబలి’గా మారి ఓ నెలన్నర క్రితమే మన ఫిల్మీ ఫోకస్‌లో చదివే ఉంటారు. మొన్నీమధ్యే టీమ్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ అని తీసుకొస్తున్నారు. సినిమా వచ్చి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో సినిమా రెండు ముక్కల్ని కలిపి ఒక ముక్కగా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అక్టోబరు ఎండింగ్‌లో ఆ సినిమా వస్తుంది అని కూడా చెప్పారు. అయితే ఇక్కడే ఓ డౌట్ మొదలైంది.
సినిమాను నిజంగా పదేళ్ల సందర్భంగానే ‘బాహుబలి: ది ఎపిక్’ను రిలీజ్ చేస్తాం అని చెబుతున్నా.. దీని వెనుక మరో పెద్ద కారణం ఉంది అని అంటున్నారు. అదే ‘బాహుబలి 3’. అవును మూడో ‘బాహుబలి’ సినిమాను ఘనంగా అనౌన్స్ చేసే క్రమంలోనే ‘బాహుబలి: ది ఎపిక్’ను సిద్ధం చేస్తున్నారు అనే ఓ టాక్ మొదలైంది. నిజానికి మూడో ‘బాహుబలి’ పుకార్లు ఇప్పటివైతే కావు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సమయంలోనే ఈ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అవే బయటకు వస్తున్నాయి.
అంతేకాదు ‘బాహుబలి 3’ సినిమా ఆలోచలను కొట్టిపారేయలేం అంటూ గతంలోనే చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు కూడా. ఓ సందర్భంలో రాజమౌళి కూడా పార్ట్ 3 వస్తే బాగుంటుంది అన్నారు. అదే సమయంలో ఆయన దర్శకత్వంలో కాకుండా టీమ్‌లో ఓ సీనియర్ అసోసియేట్ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తారు అని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా ఆ ఆలోచనే ముందుకు తీసుకొచ్చారని టాక్.
మరి నిజంగానే మూడో మూడో పార్టు వస్తుందా? అనేది అక్టోబరులో తేలుతుంది. ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ప్రచారం కోసం మరోసారి సినిమా టీమ్ అంతా ప్రచారం చేస్తుంది అని సమాచారం. అప్పుడు ఈ విషయంలో కచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో వెయిట్ ఫర్ అక్టోబర్ ఎండింగ్.