మొబైల్‌ను అతిగా వినియోగిస్తే అనర్థమే అని చెబుతుంటారు మానసిక నిపుణులు, ఆరోగ్య నిపుణులు. ఈ విషయాన్ని ఎంత చెప్పినా ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా వినని రోజులివి. వారి కళ్లకు కట్టేలా ఓ టీమ్ సినిమా రూపొందించింది. ఇప్పుడు ఆ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మంచి విషయం కాబట్టి. వైవిధ్యం, వాస్తవికతకు దగ్గరగా ఉండే సినిమాలు చేసే మలయాళ పరిశ్రమలోనే ఈ సినిమా కూడా రూపొందింది. ఆ సినిమా పేరు ‘ఈ వలయం’ కాగా.. దానికి రేవతి వర్మ రూపొందంచారు.
గత నెల 13న కేరళలోని థియేటర్లలో విడుదలైన ‘ఈ వలయం’ సినిమా అక్కడి విమర్శకులను కూడా మెప్పించింది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో ప్రేక్షకులు ఆదరించారు. సాధారణ ప్రేక్షకులతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా ఈ సినిమాను చూస్తున్నారట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఎక్కువగా వినియోగిస్తే ఎదురయ్యే ఇబ్బందులను సినిమాలో దర్శకురాలు ఆసక్తికరంగా, అర్థవంతంగా చూపించే ప్రయత్నం చేశారు.
మొబైల్ వినియోగానికి బానిసైన ఓ యువతి ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూడొచ్చు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే పరిస్థితుల్ని కూడా వివరించారు. మత్తుపదార్థాలు, మొబైల్ అతి వినియోగం రెండూ ఒక్కటే అనేలా సినిమాలో చెప్పుకొచ్చారు. మొబైల్ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తి ఫోన్ అందుబాటులో లేకపోతే ఎలా ప్రవర్తిస్తారు అనేది కూడా సినిమాలో చూడొచ్చు. సామాజిక స్పృహ, చైతన్యం పెంపొందించేలా రూపొందించిన ఈ సినిమాకు కేరళ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది.
ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేటప్పుడు అన్ని భాషల్లో అందుబాటులో ఉండేలా చూస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఎందరికో ఉపయోగపడే అంశం సొంత భాషలోకి వస్తుంది. మొబైల్, గ్యాడ్జెట్ల వినియోగ బాధితులు ఇప్పుడు మన చుట్టూ చాలామంది కనిపిస్తున్నారు. తర్వాతి తరం ఇలా ఉండకూడదంటే ఇలాంటి సినిమాలు చాలా అవసరం.