ఈటీవీలో న్యూస్ ఎన్ని గంటలకు ప్రసారమవుతాయో తెలియని యువత ఉన్నారేమో కానీ.. అదే సంస్థకి చెందిన ఈటీవీ ప్లస్ లో వచ్చే “పటాస్” షో టైమింగ్స్ కానీ ఆ పటాస్ షోని హోస్ట్ చేసే రవి-శ్రీముఖీలు తెలియని యూత్ లేరనే చెప్పాలి. యాంకర్లుగా మంచి పేరు సంపాదించాక ఇద్దరూ కలిసి హోస్ట్ చేస్తున్న ఈ “పటాస్” షో అటు టీవీలో.. ఇటు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ విశేషంగా ఆకట్టుకొంటోంది. ముఖ్యంగా జంటగా రవి-శ్రీముఖి చేసే అల్లరి, స్టూడెంట్స్ చెప్పే తిక్క సమాధానాలే షోకి స్పెషల్ అట్రాక్షన్. అయితే.. “పటాస్” షోతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న రవి-శ్రీముఖిలకు సినిమాల్లోనూ అదే స్థాయిలో నిలదొక్కుకోవాలనేది చిరకాల కోరిక. శ్రీముఖి ఆల్రెడీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నప్పటికీ హీరోయిన్ గా ఎదగాలన్నది ఆమె ఆశయం, అలాగే రవికి కూడా ఎప్పటికైనా కథానాయకుడిగా తన పేరును వెండితెరపై చూసుకోవాలన్నది చిన్ననాటి కోరిక.
అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ.. రవి హీరోగా నటించిన “ఇది మా ప్రేమకథ”, శ్రీముఖి హీరోయిన్ గా నటించిన “కుటుంబ కథా చిత్రం” గత శుక్రవారం విడుదలయ్యాయి. రెండు సినిమాలూ కనీస స్థాయిలో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక డిజాస్టర్లుగా నిలిచి.. సినిమాల్లో రాణించాలనే రవి-శ్రీముఖిల కలలపై నీళ్ళు చల్లాయి. యాంకర్ రవిని హీరోగా పరిచయం చేస్తూ అయోధ్య కార్తీక్ అనే యువకుడు తెరకెక్కించిన “ఇది మా ప్రేమకథ” చూసే ప్రేక్షకులు సినిమా సగంలోనే థియేటర్ల నుండి బయటకి వచ్చేస్తుండగా.. “కుటుంబ కథా చిత్రం” కథేమిటో అర్ధం కాక తలలు పట్టుకొంటున్నారు. అయితే.. నటన విషయంలో రవి-శ్రీముఖి పర్వాలేదనిపించినా సదరు సినిమాలు విధానం బాగోకపోవడంతో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తపడతారో లేక రిస్క్ ఎందుకని బుల్లితెరపైనే కాన్సన్ ట్రేట్ చేస్తారో చూడాలి.