ఏ సీజనూ లేకుండా వచ్చిన పెద్ద సినిమాలే (Movies) ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్లు పెంచారు. అలాంటిది సంక్రాంతి లాంటి సీజన్‌లో వస్తున్న సినిమాలకు రేట్లు పెంచకుండా ఎందుకు ఉంటారు చెప్పండి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’(Game Changer) , ‘డాకు మహారాజ్’ సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునే ఆప్షన్ ఇచ్చింది. ఈ మేరకు జీవోలను జారీ చేసింది. రామ్‌చరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఈ నెల 10న అర్ధరాత్రి ఒంటి గంట బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చింది. టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. అలాగే ఆ తర్వాత షోలకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో అయితే రూ.175, సింగిల్ థియేటర్లలో అయితే రూ.135 చొప్పున పెంచుకునే అవకాశం ఇచ్చింది. పదో తేదీన ఆరు షోలు, 11 నుండి 23 వరకు రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని కూడా చెప్పింది. దీంతో రెండు వారాలపాటు ‘గేమ్ ఛేంజర్’ రేట్లలో ఛేంజ్ ఉంటుంది అని చెప్పొచ్చు.
మరోవైపు బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బాబీ (Bobby) కాంబినేషన్‌లో రూపొందిన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)కు సైతం ఇలాంటి ఏర్పాట్లు చేసుకునే అవకాశం కల్పించింది. 12న ఉదయం 4 గంటల ప్రత్యేక షో వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ సినిమా బెనిఫిట్ షోకి టికెట్ ధర రూ.500గా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రత్యేక ధరలు, బెనిఫిట్ షోలకు సంబంధించి ఇంకా ఎలాంటి జీవో బయటకు రాలేదు.
ఒకవేళ టికెట్ రేట్ల పెంపు ఉన్నా.. పై రెండు సినిమాల (Movies) స్థాయిలో ఉండదు అని చెప్పొచ్చు. ప్రస్తుత ధరతోనే సినిమా స్క్రీనింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉండగగా తెలంగాణలో అయితే ఇంకా టికెట్ ధరల విషయంలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో బుకింగ్‌లు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. బెనిఫిట్ షోలు అయితే ఉండవు అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.