చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమాల విషయంలో పుకార్ల షికార్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా సంక్రాంతికి వస్తుండంటే.. ఆ సినిమా గురించే మాట్లాడుకునేవాళ్లం. ఆ సినిమా వాయిదా పడటంతో కొత్త ప్రాజెక్టులను చిరంజీవి వరుస పెట్టి ఓకే చేసే పనిలో ఉన్నారు. మొన్నీమధ్యే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) – నాని (Nani) సినిమాను ఓకే చేసి చిరు.. మరో యువ దర్శకుడి కథకు పచ్చ జెండా ఊపారు అని చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అనిల్ రావిపూడితో (Anil Ravipudi) సినిమా దాదాపు ఓకే అయింది అని అంటున్నారు.
అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్.. చిరంజీవికి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అని మెగా ఫ్యాన్స్ నమ్మకం. కామెడీకి, యాక్షన్ అంశాలను జోడించి వైవిధ్యం కాస్త తగిలించి సినిమాలు చేయడం అనిల్ స్టైల్. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి ప్లానే చేశారు అని చెబుతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తారు అని వార్తలు వస్తున్నాయి. అనిల్ – సాహు కలసి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) లాంటి మంచి సినిమా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక చిరంజీవి సినిమా సంగతి చూసస్తే.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలలో చిరంజీవి క్యారెక్టరైజేషన్ రీసెంట్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది అని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అంటే శ్రీకాంత్ ఓదెల సినిమా కంటే ఇదే ముందు ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. అనిల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సంక్రాంతికి వస్తున్నారు.
అక్కడికి మూడు నెలల గ్యాప్‌లోనే చిరంజీవి సినిమా ఉంటుంది అంటున్నారు. అయితే ఇక్కడే ఓ డౌట్. చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మాణంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలసి ఆ సినిమా ఉంటుంది అని అన్నారు. దీని కోసం బీవీఎస్ రవి ఓ కథ కూడా సిద్ధం చేశానని చెప్పారు. మరి ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు.