నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత (Sobhita Dhulipala) వివాహం ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరిదీ ప్రేమ వివాహం అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు తమ ప్రేమను అనౌన్స్ చేయకముందే సోషల్ మీడియాలో వాళ్ల హాలీడే ట్రిప్‌ల ఫొటోలు బయటకు వచ్చేశాయి. ఈ క్రమంలో వాళ్లూ తమ ప్రేమను, పెళ్లిని అనౌన్స్ చేశారు. తాజాగా వాళ్ల ప్రేమకథ గురించి శోభిత ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.
మొదటిసారి 2018లో నాగార్జున (Nagarjuna) ఇంటికి తాను వెళ్లినట్లు శోభిత చెప్పింది. అక్కడికి నాలుగేళ్ల తర్వాత అంటే 2022 ఏప్రిల్‌లో చైతూతో స్నేహం మొదలైనట్లు చెప్పింది. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా అని చెప్పిన శోభిత ఇద్దరం ఫుడ్ గురించే ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం అని చెప్పింది. ఆ సమయంలో తెలుగులో మాట్లాడమని చైతన్య తరచూ అడిగేవాడని తెలిపింది.
అలా అప్పుడప్పుడు మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడిందని చెప్పిన శోభిత.. తాను ఇన్‌స్టాలో షేర్ చేసే గ్లామర్ ఫొటోలను కాకుండా తన ఇతర పోస్టులను చైతన్య లైక్ చేసేవాడు అని చెప్పింది. తమ మొదటి పరిచయం మాత్రం ముంబయిలోని ఓ కేఫ్‌లో జరిగినట్లు చెప్పింది. అయితే తామిద్దరం అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌కు వెళ్లాక తమ బంధం గురించి అందరికీ తెలిసింది అని నాటి విషయాలు చెప్పుకొచ్చింది శోభిత. మరి ప్రపోజ్ ఎప్పుడు చేశాడు అంటే..
ఓసారి నాగచైతన్య కుటుంబం నూతన సంవత్సర వేడుకలకు తనను ఆహ్వానించిదని.. ఆ తర్వాతి రోజే ప్రేమను బయటపెట్టాడు అని చెప్పింది. అక్కడికి ఏడాది తర్వాత తామిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చిందని చెప్పింది. అది కూడా గోవాలోనే జరిగిందని చెప్పింది. ఆ తర్వాత ఈ నెల 4న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతోపాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.